షాకింగ్: అమరావతి రైతులకు అండగా వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీయువకులు ‘న్యాయస్థానం టు దేవస్థానంస మహాపాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ పాదయాత్రకు ఊరూరా ప్రజలు, టీడీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే, పాదయాత్రకు అనూహ్యంగా తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.

కొద్ది రోజులుగా రైతుల చేస్తున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. వారం రోజుల పాటు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అయితే, కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఉదయం పాదయాత్ర చేస్తున్న రైతులకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మరో, వారం రోజులపాటు నెల్లూరులోనే యాత్ర జరగనున్న నేపథ్యంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయాలంటూ శ్రీధర్ రెడ్డి చెప్పడం షాకింగ్ గా మారింది.

పాదయాత్ర చేస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించిన శ్రీధర్ రెడ్డి…వర్షాలు, వరదల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చారు. అయితే, వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలోనే రాజధాని రైతులను కలిశానని కోటం రెడ్డి తెలిపారు. తమ జిల్లాలో పర్యటన సందర్భంగా వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయమన్నానని చెప్పారు.

అయితే, అమరావతికి మద్దతివ్వాలని మహిళా రైతులు తనను కోరారని, కానీ, పార్టీ ఏ స్టాండ్ లో వెళ్తే.. తనదీ అదే స్టాండ్ అని చెప్పానన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదన్నదే తన ఉద్దేశమని చెప్పారు. అందుకే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయమన్నానని, అదే మానవత్వం, సంస్కారం అని అన్నారు.