జ‌గ్గారెడ్డి ప్రేమ‌..రాముల‌మ్మ కోపం...కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం

జ‌గ్గారెడ్డి ప్రేమ‌..రాముల‌మ్మ కోపం...కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం

వ‌రుస వైఫ‌ల్యాల‌తో కుదేల‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఓట‌మి పాఠాల‌ను నేర్చుకోవ‌డం లేదు. పైగా నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటూ, పార్టీలో క‌ల‌క‌లానికి కార‌ణం అవుతున్నారు. తాజాగా ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర‌పై కామెంట్లు పార్టీలో నెల‌కొన్న అనైక్య‌త‌ను, అస‌మ్మ‌తి రాజ‌కీయాలకు అద్దం ప‌ట్టారు. ఆ ఇద్ద‌రు నేత‌లే కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి,ఆ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రానుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. దీంతోపాటుగా యూపీఏలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్ కూడా కూటమిలో చేరుతారని, దీంతోపాటుగా వారు కీల‌క నేత‌లు అవుతార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి భ‌గ్గుమ‌న్నారు. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట‌య్యారు జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని అన్నారు. ఈ మేర‌కు అంశాల వారీగా ఆమె వివ‌రించారు.

జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు స‌రైన‌వి కావ‌ని విజ‌య‌శాంతి తెలిపారు. ``ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా చేరబోతోందని చెబితే, స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు మేలు జరుగుతుంది. యూపీఏ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్ధితి ఉంటే టీఆర్ఎస్  తో పాటు వైసీపీ మద్దతు అవసరం ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు గెలవలేనప్పుడే యూపీఏలో లేని పార్టీల మద్దతు కోసం ఆలోచించాల్సి ఉంటుంది. ఓవైపు పూర్తి మెజారిటీతో కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం ఏర్పడుతుందని హైకమాండ్ నేతలు చెబుతుంటే, దానికి భిన్నంగా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హైకమండ్ మాటల కంటే, టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్న కేసీఆర్ మాటలను ఆయన విశ్వసిస్తున్నారేమో? కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదు' అని విజయశాంతి పేర్కొన్నారు. ఆమె ట్వీట్‌పై జ‌గ్గారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. స్థూలంగా కాంగ్రెస్‌లో మ‌ళ్లీ చీలిక‌కు కేసీఆర్ కార‌ణం అవుతున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English