శ‌త్రువు మిత్రుడిని ఎలా రానిస్తారు కేసీఆర్ గారూ ?

శ‌త్రువు మిత్రుడిని ఎలా రానిస్తారు కేసీఆర్ గారూ ?

శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడే. కానీ శ‌త్రువుకు మిత్రుడు... మిత్రుడు కాదు క‌దా. ఈ లెక్క‌ను టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రిచిన‌ట్టున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన నేత‌గా గుర్తింపు సంపాదించుకున్న కేసీఆర్‌... ఈ చిన్న సూత్రాన్ని ఎలా మ‌రిచిపోయార‌న్న విష‌యం ఇప్పుడు నిజంగానే వైర‌ల్ గా మారిపోయింది. జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి దూరంగా ఉంటూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట కొత్త కూట‌మిని ఏర్పాటు చేస్తానంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు చేసిన కేసీఆర్‌... ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

నిన్న కేర‌ళ వెళ్లిన కేసీఆర్‌... అక్క‌డ అనంత ప‌ద్మ‌నాభుడిని ద‌ర్శించుకుని, ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ను సాద‌రంగానే ఆహ్వానించిన పిన‌ర‌యి... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా చ‌ర్చ‌లూ జ‌రిపార‌ట‌. ఇదే ఉత్సాహంతో కేసీఆర్ కేర‌ళ ప‌ర్య‌ట‌న ముగించుకుని త‌మిళ‌నాడుకు బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. అయితే తిరువ‌నంత‌పురంలో చెన్నై ఫ్లైటెక్కే ముందే... ఎందుకైనా మంచిద‌ని త‌మిళ‌నాడులో విప‌క్షంగా ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు ఫోన్ కొట్టార‌ట‌. తాను చెన్నై వ‌స్తున్నాన‌ని, త‌మ‌రిని క‌లుస్తాన‌ని చెప్పార‌ట‌.

అయితే అందుకు స్టాలిన్ అక్క‌డిక‌క్క‌డే నిర్మోహ‌మాటంగా వీల్లేదంటూ తేల్చేశార‌ట‌. కేసీఆర్ తో క‌లిసేందుకు తాను సిద్ధంగా లేన‌ని స్టాలిన్ ముఖం మీదే చెప్పేశార‌ట‌. దీంతో షాక్ తిన్న కేసీఆర్‌... ఎలాగూ ఫ్యామిలీతో క‌లిసి వెళ్లారు క‌దా... స్టాలిన్ కాక‌పోతే... త‌మిళ‌నాడులోని దేవుళ్ల‌ను మొక్కుకుని వెళ‌తానంటూ ఫ్లైటెక్కేశార‌ట‌. అయినా స్టాలిన్ అండ్ కో... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి మిత్రులు క‌దా. చంద్ర‌బాబుకు మిత్రుడిగా ఉన్న స్టాలిన్‌... అదే చంద్ర‌బాబుకు విరోధిని అయిన త‌న‌తో ఎలా క‌లుస్తార‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఆలోచించలేక‌పోయారా? అన్న విశ్లేష‌ణలు ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్నాయి.  
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English