అమెరికా కోర్ట్‌ గుడ్ న్యూస్‌...మ‌న విద్యార్థులు సేఫ్‌

అమెరికా కోర్ట్‌ గుడ్ న్యూస్‌...మ‌న విద్యార్థులు సేఫ్‌

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌నోళ్ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. గ‌త కొద్దికాలంగా టెన్ష‌న్‌కు గురి చేస్తున్న విష‌యంలో కోర్టు తీర్పు ఆందోళ‌న‌ను దూరం చేసే రీతిలో వెలువ‌డింది. విదేశీ విద్యార్థులు అమెరికాలో అక్రమంగా నివసించడాన్ని అరికట్టే ఓ ప్రతికూల విధానాన్ని యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ) అమలు చేయకుండా అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అమెరికాలో నివసించేందుకు అనుమతించిన కాలం పూర్తి కాకపోయి నా.. ఓ విద్యార్థి తెలిసో తెలియకో తన విద్యార్థి వీసాను ఉల్లంఘించినట్టు తేలితే...ఆ రోజు నుంచే అతడు/ఆమె అక్రమంగా నివసిస్తున్నట్టు పరిగణిస్తారు. అలాంటి వారికి తాజా తీర్పు పెద్ద ఊర‌ట‌.

గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సీఐఎస్ విధానం ప్రకారం.. అక్రమంగా నివసిస్తున్న విద్యార్థులను నిర్దిష్ట కాలం వరకు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. 180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడు సంవ‌త్స‌రాల‌ నిషేధం, ఏడాదికి పైగా నివసించిన వారిపై పది సంవ‌త్స‌రాల‌ నిషేధం విధించనున్నారు. ఈ నిషేధం సదరు విద్యార్థులపై ఆధారపడిన వారికి, వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు కూడా వర్తిస్తుంది. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి.ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తుందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి. విదేశీ విద్యార్థుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి.

విద్యార్థులు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించ‌డం స‌రికాద‌ని కోర్టులో పిటిష‌నర్ల త‌ర‌ఫు అటార్నీలు వాధించారు. వారి వాద‌న‌తో ఏకీభ‌వించిన అమెరికాలో తాత్కాలిక కోర్టు ఈ ఆదేశాల‌పై నిషేధాజ్ఞ‌లు విధించింది. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కానప్పటికీ, ప్రస్తుతం జారీ అయిన తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English