కేసీఆర్ కు ఉన్న‌ట్లుండి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గుర్తుకొచ్చిందే!

 కేసీఆర్ కు ఉన్న‌ట్లుండి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గుర్తుకొచ్చిందే!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు భ‌లేగా ఉంటుంది. రాష్ట్రంలో క‌మ్యూనిస్ట్ నేత‌ల‌కు క‌నీసం అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. తాజాగా కేర‌ళ వెళ్లి క‌ల‌వ‌నున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొద‌లై ఇన్నాళ్లు అయినా ఇప్ప‌టివ‌ర‌కూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశమై ఆయ‌న ఎవ‌రితోనూ చ‌ర్చ‌లు జ‌రిపింది లేదు. అలాంటి ఆయ‌న‌కు ఐదో విడ‌త పోలింగ్ షురూ అయ్యేందుకు కొన్ని గంట‌ల ముందు ఒక్క‌సారిగా ఫ్రంట్ గుర్తుకొచ్చింది. అంతేకాదు.. ఆయ‌న కేర‌ళ ట్రిప్ గురించి ఒక ప్రెస్ నోట్ విడుద‌లైంది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చ‌ర్చ జ‌రిపేందుకు కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తో చ‌ర్చించేందుకు కేర‌ళ వెళ్ల‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. విజ‌య‌న్ తో చ‌ర్చ‌ల అనంత‌రం కేసీఆర్ రామేశ్వ‌రం.. శ్రీ‌రంగం ఆల‌యాల్ని సంద‌ర్శించ‌నున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో గ‌తంలో ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ స‌మావేశ‌మై.. చ‌ర్చ‌లు జ‌రిపిన కేసీఆర్.. తాజాగా కేర‌ళ ముఖ్య‌మంత్రిమీద దృష్టి సారించ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పిన‌ర‌య్ పార్టీకి పెద్ద‌గా సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. కాంగ్రెస్ కూట‌మికే సీట్లు ఎక్కువ‌గా వ‌చ్చే వీలుందంటున్నారు. అలాంటివేళ‌లో కేసీఆర్ వెళ్లి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజాగా కేసీఆర్ టూర్ మొత్తం రాజ‌కీయ కోణంలో సాగుతున్న‌దే త‌ప్పించి.. మ‌రింకేమీ లేదంటున్నారు. గ‌డిచిన రెండున్న‌ర వారాలుగా తెలంగాణ‌లో ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారం ర‌చ్చ ర‌చ్చ‌గా సాగుతోంది. ఎంతకూ స‌ద్దుమ‌ణ‌గ‌టం లేదు. ఇలాంటివేళ‌లో వ్యూహాత్మ‌కంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న తేవ‌టం ద్వారా ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌వ‌చ్చ‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌ప‌క్క కామ్రేడ్స్ తో స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌ని కేసీఆర్.. అదే స‌మ‌యంలో వారి ముఖ్య‌మంత్రితో భేటీ కానుండ‌టం.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English