నేను ఒంటరిని...కేటీఆర్‌లో ఆవేద‌న?

నేను ఒంటరిని...కేటీఆర్‌లో ఆవేద‌న?

ఔను! మీరు స‌రిగ్గానే చ‌దివారు!! తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కే చంద్ర‌శేఖ‌ర్ రావు కుమారుడైన ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించే ఆ కామెంట్‌. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ తాను ఒంటరి అయ్యాన‌ని ఫీల‌వుతున్నార‌ట‌. వార‌స‌త్వ పోరులో భాగంగా పార్టీ నాయ‌క‌త్వం బెర్తు ఖ‌రారు చేసుకున్న కేటీఆర్‌కు ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల మ‌ద్ద‌తు క‌రువైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స‌న్నిహితుల వద్ద వ్య‌క్తం చేశార‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో కేటీఆర్ ఈ విధంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం.

వివ‌రాల్లోకి వెళితే...ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో నెల‌కొన్న గంద‌ర‌గోళంతో అధికార పార్టీని విప‌క్షాలు టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్లోబరీనా వ్యవహారంలో పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌  రేవంత్‌‌ రెడ్డి, ఇతర నేతలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. అయితే, దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మే డే వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ, తనకు గ్లోబరీనాతో సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు . రూ.10 వేల కోట్ల స్కాం చేసినట్టు రేవంత్‌‌ ఆరోపించడంపైనా కేటీఆర్‌‌  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4.30 కోట్ల టెండర్‌‌కు రూ.10 వేల కోట్ల లంచమిస్తారా అని ప్రశ్నించారు. అదే  వేదికపై నుంచి కాంగ్రెస్‌‌ సీనియర్‌‌ నేత వీహెచ్ పై విరుచుకుపడ్డారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో కేటీఆర్ మిన‌హా మ‌రెవ్వ‌రూ స్పందించారు. ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ మినహా ఎవరూ ఖండించలేదు.

త‌న‌పై చేసిన‌ విమర్శలను ఒక్కరూ ఖండించక‌పోవ‌డాన్ని టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ తప్పుబట్టినట్టు తెలిసింది. తనపై  కాంగ్రెస్‌‌ నేతలు చేసిన ఆరోపణలను తానే ఖండించుకోవాలా అని కొందరు సన్నిహితుల వద్ద కేటీఆర్‌‌  ప్రస్తావించినట్టుగా తెలిసింది. గ్లోబరీనా విషయంలో వచ్చిన ఆరోపణలను తనకు మాత్రమే పరిమితమైనవి అన్నట్టు మంత్రులు, నేతలు వ్యవహరిం చడాన్ని కేటీఆర్‌‌ తప్పుబడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులపై కేటీఆర్‌‌ కినుక వహించినట్టు తెలిసింది.

మంత్రులు, ఇతరనేతల తీరుతోనే కేటీఆర్‌‌ రెండు, మూడు రోజులుగా బయటికి రావడం లేదని, ఎవరితోనూ మాట్లాడటం లేదని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొందరు ముఖ్యనేతలు ఆఫ్‌‌ ది రికార్డుగా పెద్దాయన వీహెచ్‌ ను ఉద్దేశించి బఫూన్‌‌ అనకుంటే బాగుండు అన్నట్టు చేసిన వ్యాఖ్యలూ కేటీఆర్‌‌ దృష్టికి వచ్చినట్టుగా తెలిసింది.ఆరోపణలను ఖండించకపోగా తననే తప్పుబట్టేలా బయటి వ్యక్తుల వద్ద ప్రస్తావించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English