సిరివెన్నెల‌కు అనారోగ్యం.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ

sirivennela
sirivennela

ఈ సోష‌ల్ మీడియా యుగంలో సెల‌బ్రెటీల ఆరోగ్యాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ఏ వార్త‌ను న‌మ్మాలో, ఏది న‌మ్మ‌కూడ‌దో అర్థం కాదు. నిక్షేపంగా ఉన్న వాళ్ల‌ను చంపేయ‌డం.. కాస్త అనారోగ్యం అన‌గానే ప‌రిస్థితి విష‌మం అని ప్ర‌చారం చేయ‌డం చాలా కామ‌న్ అయిపోయింది ఈ రోజుల్లో. చంద్ర‌మోహ‌న్ స‌హా చాలామంది విష‌యంలో సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారాల గురించి తెలిసిందే. ఇప్పుడు దిగ్గ‌జ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కూడా నెగెటివ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో తిరుగుతోంది.

సీతారామ‌శాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, రెండు రోజుల నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ని తాజాగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారని, ప్రస్తుతం సిరివెన్నెలకు ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని, పరిస్థితి బాగా లేద‌ని కొన్ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీనిపై సిరివెన్నెల కుటుంబం స్పందించింది.

సీతారామ‌శాస్త్రి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే అని.. కానీ ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని కుటుంబం స్ప‌ష్ట‌త ఇచ్చింది. సీతారామ‌శాస్త్రి న్యుమోనియాతో ఇబ్బంది పడుతుండడంతోనే ఆసుపత్రిలో జాయిన్ చేశామని, ఇది రెగ్యులర్ చెకప్‌లో భాగమేనని, తీవ్ర అస్వస్థత పరిస్థితుల్లో ఏమీ ఆయ‌న‌ లేరని.. అభిమానులెవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ స‌భ్యులు క్లారిటీ ఇచ్చారు. సిరివెన్నెల‌కు ముందు కొవిడ్ సోకింద‌ని.. త‌ర్వాత న్యుమోనియా అటాక్ అయింద‌ని ప్ర‌చారం సాగుతోంది.