గార్డును నాలుగో పెళ్లి చేసుకోనున్న ఆ దేశ రాజు!

గార్డును నాలుగో పెళ్లి చేసుకోనున్న ఆ దేశ రాజు!

రాజులు.. రాజ్యాలు.. అన్ని సినిమాల్లో చూసేవే. అది మ‌న దేశంలో క‌త‌. కానీ.. ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో ఇంకా రాజ‌రికం న‌డుస్తోంది. ఇలాంటి చోట్ల ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలిస్తే నోట మాట రాదంతే. ప్ర‌జాస్వామ్యం పుణ్య‌మా అని.. ఎవ‌రినైనా.. ఎలాంటి విమ‌ర్శ అయినా చేసే వీలుంది. కాకుంటే.. చ‌ట్ట‌బ‌ద్ధంగా కొన్నిసార్లు చ‌ర్య‌లు ఎదురైనా.. విష‌యాన్ని దాచే ప‌రిస్థితి మాత్రం ఉండ‌దు.

కానీ.. రాజ‌రికం న‌డిచే దేశాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంటాయి. రాజుగారికి కోపం వ‌స్తే చాలు.. చెల‌రేగిపోతారు. కుటుంబ స‌భ్యులే కాదు.. వారికి త‌ల ఎగ‌రేసిన వారి ఆచూకీ త‌ర్వాత క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇంత‌కూ ఈ మాట‌ల‌న్ని ఎందుకంటే.. ఇప్పుడు చెప్పే రాజుగారి క‌థ‌లోనూ ఇలాంటివి ఉంటాయి మ‌రి.

రాజుల ఏలుబ‌డిలో ఉండే రాజ్యాల్లో థాయ్ లాండ్ ఒక‌టి. ఆ దేశానికి రాజు మ‌హా వాజిర‌లోంకోర్న్.. ప‌ల‌క‌టానికి ఇబ్బందిగా ఉందా?  ఏం ఫ‌ర్లేదు.. సింఫుల్ గా రాజుగారిని మ‌హావ‌జిర అని పిలుద్దాం. ఆయ‌న‌గారికి 66 ఏళ్లు. ఇంత వ‌య‌సు వ‌చ్చినా రాజుగారికి ప‌ట్టాభిషేకం కాలేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది. ఇంత‌కాలం ఎందుకు జ‌ర‌గ‌లేదంటే.. పెద్ద రాజు బ‌తికి ఉన్నంత కాలం.. ఆయ‌న వార‌సులు ఆ పీఠాన్ని చేప‌ట్ట‌లేరు. గ‌త ఏడాది పెద్ద రాజువారు మ‌ర‌ణించారు. సంతాప దినాలుగా ఏడాది త‌ర్వాత ప‌ట్టాభిషేకాన్ని చేయాల‌ని డిసైడ్ చేశారు. మ‌రో మూడు.. నాలుగు రోజుల్లో ఆయ‌న‌కు అధికారికంగా ప‌ట్టాభిషేకాన్ని చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి.

అలాంటివేళ‌.. ఆయ‌నో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. త‌న ద‌గ్గ‌ర గార్డుగా ప‌ని చేసే 40 ఏళ్ల సుథిద‌ను పెళ్లాడాల‌ని ఫిక్స్ అయ్యారు. ఇంత వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ పెళ్లి కాలేదా? అంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే.

ఎందుకంటే ఇప్ప‌టికే ఆయ‌న‌కు మూడు పెళ్లిళ్లు జ‌ర‌గ‌టం.. వారితో తెగ‌తెంపులు చేసుకొని విడాకులు ఇచ్చేయ‌టం జ‌రిగింది. ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకున్నారు. ఇక‌.. రాణులుగా వ్య‌వ‌హ‌రించే వారి ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యం.. ఈ మ‌ధ్య‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల్ని చూస్తే వామ్మో అనుకోకుండా ఉండ‌లేం. రాజుగారి బ‌ర్త్ డే వేళ‌.. ఆయ‌న క‌ట్ చేసిన కేక్ తినాలంటే.. రాజుగారి కుక్క‌తో పాటు.. రాణిగారు నేల మీద పాక్కుంటూ కేకు ముక్క తినాలి. అది కూడా ఒంటి మీద నూలుపోగు లేకుండా. ఇలాంటి సిత్రాలు థాయ్ రాజ‌కుటుంబంలో చాలానే క‌నిపిస్తాయి.

ఇక‌.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న నాలుగో భార్య గురించి కాస్త చెప్పుకోవాల్సిందే. ఎలాంటి రాచ‌రిక బ్యాక్ గ్రౌండ్ లేకున్నా... ఆయ‌న మ‌నసుప‌డ్డారు. ఆ మాట‌కు వ‌స్తే.. గ‌డిచిన కొన్నేళ్లుగా వీరిద్ద‌రూ జంట‌గానే క‌లిసి ఉంటున్నారు. వీరికి సంతానం కూడా ఉంద‌ని చెబుతారు. అధికారికంగా భార్య‌భ‌ర్త‌లుగా కాన‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రూ క‌లిసి కాపురం ఉంటున్న‌ట్లుగా చెబుతారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రాజును పెళ్లాడిన నాలుగో భార్య సుథిత బ్యాక్ గ్రౌండ్ చాలా నార్మ‌ల్ ప‌ర్స‌న్ గా చెప్పాలి.

థాయ్ ఎయిర్ వేస్ లో సాధార‌ణ ఫ్లైట్ అటెండెంట్ గా ప‌ని చేసిన ఆమెను రాజు ఐదేళ్ల క్రితం త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా ద‌ళంలోకి తీసుకొచ్చారు. తొలుత ఆమెను డిప్యూటీ క‌మాండ‌ర్ గా నియ‌మించారు. త‌ర్వాత 2017లో త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తాద‌ళంలో డిప్యూటీ క‌మాండ‌ర్ గా తీసుకున్నారు. ఆమెకు లేడీ అన్న అర్థం వ‌చ్చేలా రాయ‌ల్ టైటిల్ థాన్ ప్యూంగ్ తో గుర్తింపు ఇచ్చారు. వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్.. స‌మ్ థింగ్ జ‌రుగుతుంద‌న్న మాట వినిపించినా.. అదేదీ నిజం కాద‌న్న మాట‌ను చెప్పేవారు కానీ నిజం మాత్రం వెల్ల‌డించేవారు కాదు.

ఇంత‌కు ముందు చేసుకున్న మూడు పెళ్లిళ్ల‌కు ఏడుగురు పిల్ల‌లు ఉన్నారు. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా మూడో వైఫ్ ఆచూకీ మాత్రం తెలీటం లేదంటారు. రాజు త‌లుచుకుంటే ఇదేమైనా పెద్ద మ్యాట‌రా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఇదిలా ఉంటే.. తాజాగా పెళ్లాడిన నాలుగో భార్య‌తో అయినా త‌మ రాజు దీర్ఘ‌కాలం కాపురం చేస్తే బాగుండ‌ని థాయ్ ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ట‌. మ‌రి.. అక్క‌డి ప్ర‌జ‌లు అనుకున్న‌ట్లుగా రాజుగారు కాపురం చేస్తారా ఏంటి? మ‌రీ పెళ్లి ఎన్నాళ్లు న‌డుస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English