సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘యతి’ అడుగులు

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘యతి’ అడుగులు

యతి.. కొందరేమో దీన్ని ఒక కోతి జాతికి చెందిన రూపం అంటారు. ఇంకొందరేమో అది హనుమంతుడి అవతారంగా పేర్కొంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఐతే హిమాలయాల్లో యతి సంచారం ఇప్పటికీ ఉందన్న సందేహాలు మాత్రం ఉన్నాయి. హిమాలయాల్లో యతి సంచారానికి సంబంధించిన రుజువుల్ని అప్పుడప్పుడూ చరిత్రకారులు బయటపెడుతుంటారు.

తాజాగా ఇండియన్ ఆర్మీనే హిమాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తి అడుగులకు సంబంధించిన చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి యతి అడుగులే అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో నిన్నట్నుంచి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. కొందరు దీన్ని సీరియస్‌గా తీసుకుంటుంటే.. ఇంకొందరేమో ఈ అడుగుల విషయమై కామెడీ చేస్తున్నారు.

ఈ అడుగులు ఎవరివి అనే ప్రశ్నకు సమాధానంగా కొందరు నెటిజన్లు ‘ఎవెంజర్స్’ సినిమాలోని థానోస్‌వి అని బదులివ్వడం విశేషం. మరో నెటిజన్ ఏమో.. ఇండియాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యతి ఓటు వేయడానికి వచ్చి ఉండొచ్చని చమత్కరించారు. మరో నెటిజన్ ఏమో.. యతి అంటే దేవుడి అవతారం కదా, అతను కాళ్లతో మామూలు మనిషిలాగే నడుస్తాడా అని ప్రశ్నించాడు. ఇది ఎవరైనా చైనీయుడు ఇండియన్ బార్డర్లోకి అక్రమంగా చొరబడి నడవడంతో పడ్డ గుర్తులని మరో నెటిజన్ అనుమానం వ్యక్తం చేశాడు.

ఎవరో కావాలనే మంచులో స్కేటింగ్ చేయడానికి ఉపయోగించే పెద్ద షూస్ వేసుకుని నడిస్తే ఆ గుర్తులు పడి ఉండొచ్చని.. దీని గురించి పెద్ద డిస్కషన్ అనవసరమని ఇంకో వ్యక్తి కొట్టిపారేశాడు. ఐతే హిమాలయాల్లో కోతికి, మనిషికి మధ్యస్థంగా ఉండే జాతి నివసిస్తోందన్న అనుమానాలు మాత్రం ఎప్పట్నుంచో ఉన్నాయి. మరి ఈ అడుగులు ఎవరివన్న ప్రశ్నకు ఆర్మీనే సమాధానం చెబుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English