ఐదేళ్ల త‌ర్వాత నంద్యాల వాసుల‌కు అదే విషాదం

 ఐదేళ్ల త‌ర్వాత నంద్యాల వాసుల‌కు అదే విషాదం

పెద్ద‌గా ప‌ట్టించుకోం కానీ కొన్నిసార్లు ఒకేలాంటి అంశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నంద్యాల ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఐదేళ్ల క్రితం సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌వేళ‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకొని ఇంటికి వ‌చ్చే క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత శోభానాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం తెలిసిందే.

ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి నంద్యాల వాసుల్ని తీవ్రంగా క‌లిచివేసింది. నంద్యాల ఎంపీ స్థానం ప‌రిధిలో ప్ర‌ముఖ‌మైన రాజ‌కీయ కుటుంబాల్లో ఒక‌టైన భూమా కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం అక్క‌డి ప్ర‌జ‌ల్ని వేద‌న‌కు గురి చేయ‌గా.. తాజాగా మ‌రో రాజ‌కీయ కుటుంబానికి చెందిన ప్ర‌ముఖుడు.. ఎన్నిక‌ల వేళ‌లోనే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌టం గ‌మ‌నార్హం.

నంద్యాల పైపుల కంపెనీ య‌జ‌మానిగా తెలుగు వారికి సుప‌రిచితుడైన ఎస్పీవైరెడ్డి.. ఎంపీగా వ‌రుస‌గా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అలాంటి ఆయ‌న గ‌డిచిన కొద్ది రోజులుగా తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్నారు. ఆసుప‌త్రిలోనే ఉన్న ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్నాయి. ఐదేళ్ల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో నంద్యాల ఎంపీ ప‌రిధిలోని శోభానాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే.. ఈసారి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎస్పీవై  రెడ్డి అనారోగ్యంతో మ‌ర‌ణించ‌టం జీర్ణించుకోలేని ప‌రిస్థితి.

ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌ల వేళ‌లో.. రెండు పెద్ద రాజ‌కీయ కుటుంబాల‌కు చెందిన ప్ర‌ముఖులు మ‌ర‌ణించ‌టం యాదృశ్చిక‌మే అయినా.. తాము ఎంత‌గానో అభిమానించే నాయ‌కుల మ‌ర‌ణం నంద్యాల వాసుల్ని క‌లిచివేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English