కేసీఆర్ దూకుడుకు హైకోర్టు బ్రేక్ వేస్తుందా?

కేసీఆర్ దూకుడుకు హైకోర్టు బ్రేక్ వేస్తుందా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దూకుడుకు బ్రేక్ ప‌డుతుందా? ఆయ‌న ప్ర‌జాస్వామ్యవ్య‌తిరేక విధానాల‌ను రాష్ట్ర సర్వోన్న‌త  న్యాయ‌స్థానం నిలువ‌రించ‌గ‌ల‌దా?  తాజాగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. హైకోర్టులో దాఖ‌లైన పిటిస‌న్ నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇదంతా టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసే ఎపిసోడ్ గురించి. దానిపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేయ‌డం గురించి.

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.  అయితే, ఆదిలోనే ఆ పార్టీకి షాకిస్తూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు షాకివ్వ‌డం మొదలుపెట్టారు. ఇలా 11మంది ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ పార్టీ త‌న గూటికి చేర్చుకుంది. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పితే....టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీ విలీనం ఖాయ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అల‌ర్ట్ అయింది. హైకోర్టును ఆశ్ర‌యించింది. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ సభ్యుల పక్షాన్ని అధికార టీఆర్ఎస్‌ పక్షంలో విలీనం చేయాలని కుట్ర జరుగుతోందని, ఇలాంటి చర్యలు తీసుకునేముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని వ్యాజ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కలు హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ను పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు.

శాస‌న‌స‌భా ప‌క్షాన్ని విలీనం చేసే అధికారం శాసన సభ స్పీకర్‌కు ఏమాత్రం లేదని, పదో షెడ్యూల్‌ నిబం ధనల ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్‌ పరిధిలోని అంశం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎల్పీని టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం చేసే ముందు, పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలనే తమ ఫిర్యాదుల్ని స్పీకర్‌ విచారించి తగిన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు వ్యాజ్యంలో పేర్కొన్నారు. తమకు తెలియకుండా నిర్ణయం తీసుకోరాదని, తమ వాదన విన్న తర్వాతే నిర్ణయాలు తీసుకునేలా కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న పార్టీ శాసనసభ్యుల పక్షాన్ని అధికారపార్టీ పక్షంలో విలీనం చేయాలనే ప్రయత్నాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రజా స్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని, ప్రజా తీర్పును అపహాస్యం చేయడమేనని వారు వ్యాజ్యంలో తప్పు పట్టారు. ఇదే విధంగా శాసనమండలిలో చేశారని, ఇప్పుడు కనుక హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుంటేనే శాసనసభ విషయంలో అడ్డుకునేందుకు వీలవుతుందని అన్నారు. ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన చట్టసభ ప్రతినిధులకే జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే బాధ్యత ఇవ్వడం దారుణమన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English