బాబును తిట్టే ఊపులో విజ‌య సాయి లాజిక్ మిస్!

బాబును తిట్టే ఊపులో విజ‌య సాయి లాజిక్ మిస్!

రాజ‌కీయం అన్నాక‌.. ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకోవ‌టం మామూలే. ప్ర‌త్య‌ర్థిని టార్గెట్ చేసిన‌ప్పుడు త‌ప్పించుకోలేని రీతిలో ఉండాలే త‌ప్పించి.. సెల్ఫ్ గోల్ వేసుకున్న‌ట్లుగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. పెద్ద ఆడిట‌ర్ గా పేరున్న రాజ‌కీయ నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క స్థానంలో ఉన్న విజ‌య‌సాయి మాత్రం అదే ప‌నిగా బుక్ అవుతూ ఉంటారు. తెలుగు రాజ‌కీయాల్లో విజ‌య‌సాయి మాదిరి ప‌చ్చిగా.. ఎలాంటి మొహ‌మాటం లేకుండా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డే నేత మ‌రొక‌రు క‌నిపించ‌రు.

తాను పోస్ట్ చేసే ట్వీట్ల‌లో ఎజెండా చాలా క్లియ‌ర్ గా క‌నిపించ‌ట‌మే కాదు.. త‌న వాద‌న‌కు వీలుగా ఏ చిన్న అంశం క‌నిపించినా.. వెనుకా ముందు చూసుకోకుండా మాట‌లు అనేసే త‌త్త్వం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

ప‌శ్చిమ‌బెంగాల్ లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మార‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. 40 మంది తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యే వేళ‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ పార్టీలోకి వ‌చ్చేస్తారంటూ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారంగా మారాయి. దేశ ప్ర‌ధాని నోటి నుంచే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వ‌స్తాయ‌ని ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిస్థితి.

దీనిపై ప‌లువురు నేత‌లు స్పందించారు. అందులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక‌రు. అంతే.. విజ‌య‌సాయి రియాక్ట్ అయ్యారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో 23 మంది ఫిరాయింపుల‌కు కార‌ణ‌మైన నువ్వు నీతులు చెప్ప‌ట‌మా? అని ప్ర‌శ్నించారు. విజ‌యసాయి యాంగిల్ లో చూస్తే.. బాబు లాంటి వ్య‌క్తి మోడీని విమ‌ర్శించ‌కూడ‌దు. అలా అని.. మోడీకి మ‌ద్ద‌తుగా నిల‌వ‌కూడ‌దు. జాగ్ర‌త్త‌గా బ్యాలెన్స్ చేస్తే త‌ప్ప వేలెత్తి చూపించుకోకుండా బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌రు.

ఏడాపెడా ట్వీట్లు ట్వీట‌ట‌మే త‌ప్పించి.. వెనుకా ముందు చూసుకోవ‌టం.. త‌న స్థాయికి త‌గ్గ‌ట్లుగా తాను చేసే వాద‌న ఉందా? అన్న జాగ్ర‌త్త విజ‌య‌సాయిలో అస్స‌లు క‌నిపించ‌దు. బాబును తిట్టే క్ర‌మంలో మోడీని వెన‌కేసుకున్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. బాబును తిడితే వ‌చ్చే మైలేజీ కంటే.. మోడీని వెన‌కేసుకు వ‌స్తున్నార‌న్న డ్యామేజే భారీగా ఉంటుంద‌న్న విష‌యాన్ని విజ‌య‌సాయి ఎందుకు మిస్ అవుతారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English