మీరు భార‌తీయుడేనా.. రాహుల్ కు కేంద్రం నోటీసు

మీరు భార‌తీయుడేనా.. రాహుల్ కు కేంద్రం నోటీసు

దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల జోరు పీక్స్ కు చేరుకున్న వేళ‌.. రాహుల్ పౌర‌స‌త్వం మీద భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఊహించ‌ని రీతిలో కేంద్రం కాంగ్రెస్ అధ్య‌క్షుడికి ఒక నోటీస్ ను పంపింది. తాజా తాఖీదులో.. మీకు విదేశీ పౌర‌స‌త్వం ఉందంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల మీద స‌మాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ పౌర‌స‌త్వంపై త‌ర‌చూ ఆరోప‌ణ‌లు చేసే బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫిర్యాదు ఇచ్చిన నేప‌థ్యంలో రాహుల్ కు తాజా నోటీసును జారీ చేసింది.

తాము పంపిన నోటీస్ కు 15 రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని కోరారు. రాహుల్ బ్రిటిష్ పౌరుడ‌ని.. ఆయ‌న పేరు రావుల్ విన్సీ అంటూ సుబ్ర‌మ‌ణ్య స్వామి కొద్దికాలంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రాహుల్ కు నాలుగు పాస్ట్ పోర్టు లు ఉన్నాయ‌ని.. అందులో ఒక‌టి రావుల్ విన్సీ అన్న పేరుతో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. అందులో ఆయ‌న మ‌తం క్రిస్టియ‌న్ గా ఉన్న‌ట్లు చెప్పి.. స్వామి సంచ‌ల‌నం సృష్టించారు.

తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాహుల్.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేధీ నుంచి.. కేర‌ళ‌లోని వ‌యునాడ్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. గ‌తంలో ఆయ‌న లోక్ స‌భ‌లో ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఆయ‌న పౌర‌స‌త్వం వివాదంగా మార‌లేదు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా రాహుల్.. భార‌తీయుడు కాద‌ని.. అత‌నికి బ్రిట‌న్ పౌర‌స‌త్వం ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏడు ద‌శ‌ల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రి ఎన్నిక‌ల ప్ర‌చారం పీక్స్ కు వెళ్లిన వేళ‌.. ఊహించ‌ని రీతిలో ఒక జాతీయ పార్టీకి చెందిన అధినేత‌కు ఈ త‌ర‌హా నోటీసులు ఇస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారే అవ‌కాశం ఉంది. ఈ నోటీసుల్లో త‌మ‌కు ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి ఇచ్చిన ఫిర్యాదును కూడా ప్ర‌స్తావించారు.

"2003లో బ్రిటన్‌లో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. 51 సౌత్‌గేట్ స్ట్రీట్, వించెస్టర్, హ్యాంప్‌షైర్ ఎస్‌వో23 9ఈహెచ్ అడ్రస్‌తో ఉన్న సదరు కంపెనీకి మీరో  డైరెక్టర్‌గానూ, సెక్రటరీగానూ ఉన్నట్టు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి నుంచి మాకు ఫిర్యాదు అందింది..." అంటూ హోంశాఖలోని పౌరసత్వ వ్యవహారాల డైరెక్టర్ బీసీ జోషి తన లేఖలో పేర్కొన్నారు.

ఇదే కాదు.. 2005 అక్టోబర్ 10న‌.. 2006 అక్టోబర్ 31న  బ్యాకోప్స్ కంపెనీ దాఖలు చేసిన వార్షిక రిటర్నుల్లో రాహుల్ తన పుట్టిన తేదీ 1970 జూన్ 10 గా.. తాను బ్రిటీష్ పౌరుడిగానూ వెల్లడించినట్టు స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము జారీ చేసిన నోటీసుల‌కు స‌మాధానాన్ని 15 రోజుల్లో తెల‌పాల్సిందిగా ఆయ‌నకు ఇచ్చిన నోటీసులో ఆదేశించారు. ఇంత‌కాలం విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లుగా ఉన్న రాహుల్ పౌర‌స‌త్వం ఎపిసోడ్ తాజా నోటీస్ తో ఫైన‌ల్స్ కు వ‌చ్చేసిన‌ట్లు చెప్పాలి. మ‌రి.. ఈ నోటీసుపై రాహుల్ రియాక్ష‌న్ ఏమిటన్న‌ది ఇప్పుడు ఉత్కంట‌ను రేకెత్తిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English