విలీనాన్ని ఆపండి, హై కోర్టుని ఆశ్రయించిన కాంగ్రెస్

విలీనాన్ని ఆపండి, హై కోర్టుని ఆశ్రయించిన కాంగ్రెస్

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అనే సంగతి ప్రతీ ఒక్కరికి తెలుసు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ తేవడం అనేది అసాధ్యం అనే విషయం అందరికి తెలుసు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరంగా తయారైంది. తమ ఉనికిని కాపాడుకునేందుకు నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతూ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. మళ్లీ ఇంకో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టంలేని టి.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కారు ఎక్కడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మొత్తం 19 సీట్లు వస్తే.. అందులో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక మిగిలింది కేవలం 9 మంది. ఇప్పటికే దాదాపు ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది కాంగ్రెస్‌. ఇలాంటి టైమ్‌లో సీఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకునేలా పావులు కదిపింది టీఆర్‌ఎస్‌. దీంతో.. విలీనం ఆపాలి అంటూ  ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క హైకోర్టుని ఆశ్రయించారు. సోమవారం హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి వారిపై వేటు వేసే విధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పి.శ్రీనివాసరెడ్డిని ఆదేశించాలని కోర్టులో పిటీషన్‌ వేశారు ఉత్తమ్‌, భట్టి.

పార్టీ  మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటీషన్‌లో కోరారు ఉత్తమ్‌, భట్టి. మంగళవారం ఈ పిటీషన్‌ విచారణకు రానుంది. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ బానోత్‌, రేగా కాంతయ్యలు గతంలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ విలీనం కాబోతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే మండలిలో విలీనంపై తీర్మానం జరిగిందని.. అసెంబ్లీలో తీర్మానం జరగకుండా హైకోర్టు స్పీకర్‌ని ఆదేశించాలని పిటీషన్‌ కోరారు కాంగ్రెస్‌ నేతలు. రాజ్యాంగం ప్రకారం పార్టీలను విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తుచేశారు. మొత్తానికి సీఎల్పీ హోదా పోకుండా ఉండేందుకు ఉత్తమ్‌, భట్టి గట్టిగానే పోరాడుతున్నారు. మరి వారి పోరాటం ఫలిస్తుందో లేదో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English