మోదీ,రాహుల్‌,షా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఏంటో తెలుసా?

మోదీ,రాహుల్‌,షా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఏంటో తెలుసా?

భార‌తదేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నికలు నాలుగో ద‌శ పోలింగ్ నేడు జ‌రుగుతోంది. ఎంద‌రో మ‌హామ‌హులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఈ ఎన్నిక‌ల ఆధారంగా నిర్ణ‌యించుకుంటున్నారు. అయితే, ఇదే ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయా నేత‌ల యొక్క వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన ఎన్నో అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. పూర్తిగా కాక‌పోయినా..కొన్ని అంశాలైనా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట్యాక్స్-ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. నేత‌ల ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ద్వారా వారి పెట్టుబ‌డుల వివ‌రాలు ప్ర‌జా బాహుళ్యానికి తెలుస్తున్నాయి.

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌ల్లోనూ పొలిటికల్ లీడర్ల పెట్టుబడులు జోరుగానే సాగుతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ట్యాక్స్-ఫ్రీ బాండ్లు, బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి ఇన్‌స్ట్రూమెంట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. గడిచిన 18 సంవ‌త్స‌రాల్లో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదుసార్లు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఆరుసార్లు ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్లు వచ్చాయి. 2001-02 మదింపు సంవత్సరం నుంచి ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకోగా, ఎన్నికల అఫిడవిట్ల ద్వారా ఈ సమాచారం తెలియవచ్చింది. రాహుల్ తల్లి సోనియా గాంధీ కూడా ఐదుసార్లు ఐటీ రిఫండ్స్‌ను పొందారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రాహుల్ గాంధీ తన ఆదాయాన్ని రూ.1.11 కోట్లకుపైగా చూపించగా, సోనియా గాంధీ రూ.9.6 లక్షలుగా ప్రకటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు మాత్రం దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ కూడా యంగ్ ఇండియన్, మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్, మోతీలాల్ ఓస్వాల్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులను కలిగి ఉన్నారు. ఇక స్టాక్ మార్కెట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లో పెట్టుబడులకే రాహుల్ గాంధీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మొత్తం 10 మ్యూచువల్ ఫండ్ స్కీంలలో రూ.5.19 కోట్ల విలువైన పెట్టుబడులు రాహుల్‌కున్నాయి. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలను రాహుల్ పొందుపరిచారు. ఇంకా రూ.5.80 కోట్ల విలువైన చరాస్తులున్నాయని, వీటిలో రూ.40,000 నగదు, బ్యాంక్స్ సేవింగ్స్‌లో రూ.17.93 లక్షలు, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ల్లో రూ.39.89 లక్షలు, రూ.2.91 లక్షల విలువైన నగలున్నట్లు వివరించారు. మరో రూ.10.08 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.72.1 లక్షల లయబిలిటీలున్నట్లు చెప్పారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తన పేరుతో, తన భార్య పేరుతో షేర్లను కలిగి ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు అమిత్ షా.. ఓ ప్రొఫెషనల్ స్టాక్ బ్రోకర్. ఈయనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), గ్రాసిమ్, హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), బజాజ్ ఆటో, కాల్గేట్ పామోలివ్, లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులున్నాయి. భారీగా లిస్టింగ్, అన్ లిస్టింగ్ షేర్లను అమిత్ షా కలిగి ఉన్నారు. మార్చి 22 నాటికి ఆయా సంస్థల్లో రూ.17.56 కోట్ల విలువైన షేర్లున్నాయని షా తన నామినేషన్‌లో తెలియజేశారు. స్టాక్ మార్కెట్లలో లేని సంస్థల్లో రూ.3.08 లక్షల విలువైన వాటాలున్నాయన్న ఆయన తన భార్య సోనాల్‌బెన్ షా పేరిట రూ.4.35 కోట్ల షేర్లున్నాయని, అన్ లిస్టింగ్ షేర్లు రూ.1.58 లక్షలని చెప్పారు. మొత్తం తన ఆస్తులు రూ.30.49 కోట్లుగా పేర్కొన్న ఆయన ఇందులో భార్యకు చెందినవి రూ.8.35 కోట్లుగా వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English