ఎన్టీఆర్‌, కేసీఆర్‌!... ఈ ఇద్ద‌రేన‌ట‌!

ఎన్టీఆర్‌, కేసీఆర్‌!... ఈ ఇద్ద‌రేన‌ట‌!

ఎన్టీఆర్‌... తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడిగా స‌మున్న‌త స్థానాన్ని సంపాదించుకుని ఆ త‌ర్వాత అదే ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని కాపాడేందుకు రాజ‌కీయాల్లోకి దిగేసిన నేత‌. అంతేనా... పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారం చేజిక్కించుకుని రికార్డు పుట‌ల‌కెక్కిన నేత‌. ఇక సంక్షేమం విష‌యానికి వస్తే... తెలుగు నేల‌లో స‌రికొత్త సంక్షేమ రాజ్యానికి పునాది వేసిన నేత కిందే లెక్క‌. ఇక కేసీఆర్‌... ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగి... త‌న ప్రాంతం తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ అయిన ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం టీడీపీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ పేరిట పార్టీ పెట్టి... తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చి, తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించేలా చేసిన నేత‌. తెలంగాణ ఏర్ప‌డ్డ త‌ర్వాత తెలంగాణ‌లో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌, రెండో ద‌ఫా కూడా రికార్డు మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే... త‌మ ప్రాంత ప్ర‌జ‌ల కోసం పార్టీలు పెట్టి, ఆ పార్టీల‌ను అధికారంలోకి తెచ్చిన నేత‌లుగా ఎన్టీఆర్‌, కేసీఆర్ లు చ‌రిత్ర సృష్టించారు. ఇదేదో విశ్లేష‌కుల లెక్క కాదు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కేసీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు మాట‌.

టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ వేడుక‌లను పుర‌స్క‌రించుకుని కేటీఆర్ ఈ మాట‌ను చెప్పుకొచ్చారు. ఈ ఇద్ద‌రికీ పోలిక పెట్టిన కేటీఆర్‌... తెలుగు ప్ర‌జ‌ల కోసం పార్టీలు పెట్టి విజ‌యం సాధించిన నేత‌లుగా వీరిద్ద‌రినీ అభివ‌ర్ణించారు. అంతేనా... త‌న తండ్రి కేసీఆర్ ను ఆయ‌న ఏకంగా ఎన్టీఆర్ స్థాయికి తీసుకెళ్లిపోయారు. కేసీఆర్ కూడా ఎన్టీవోడి అంత‌టోడేనన్న కోణంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసినట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ పోలిక ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఎన్టీఆర్ అంటే విప‌రీత‌మైన అభిమాన‌మున్న కేసీఆర్‌... ఏకంగా త‌న కుమారుడికి అన్న‌గారి పేరు వ‌చ్చేలా తార‌క‌రామారావు అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ తార‌క‌రామారావు... ఆ తార‌క‌రాముడి ఎత్తుకు త‌న తండ్రిని ఆకాశానికెత్తేశారు. మొత్తంగా పార్టీ ఆవిర్భావ వేడ‌క‌ల నాడు కేటీఆర్ ఈ వ్యాఖ్య ద్వారా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నార‌నే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English