అంబానీలు కాంగ్రెస్, బీజేపీలు రెండింటినీ కవర్ చేసేస్తున్నారు

అంబానీలు కాంగ్రెస్, బీజేపీలు రెండింటినీ కవర్ చేసేస్తున్నారు

రాజకీయాలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ అందులో ఏమాత్రం వేలు పెట్టకుండానే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న ముకేశ్ అంబానీ 2019 ఎన్నికల్లో చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ముంబయిలో బాగా పేరున్న కాంగ్రెస్ నేత మిళింద్ దేవ్‌రా తరఫున ముకేశ్ అంబానీ ప్రచారం చేసి ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు ముకేశ్ కుమారుడు అనంత్ బీజేపీ ర్యాలీల్లో కనిపించారు. దీంతో తండ్రీకొడుకులు రెండు పార్టీలకు ప్రచారం చేస్తూ రాజకీయ పార్టీలనే గందరగోళంలో పడేస్తున్నారు.

ముకేశ్ ఇటీవల దక్షిణ ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి మిళింద్ దేవరాకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ముకేశ్ కుమారుడు అనంత్ అంబానీ మోదీ సభలో కనిపించారు. ప్రధాని మోదీ ముంబయిలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో అనంత్ పాల్గొన్నారు.  దేశానికి మద్దతుగా నిలవడానికి... ప్రధాని ప్రసంగం వినడానికి తాను ఆ సభకు వెళ్లానని అనంత్ చెబుతున్నారు.

నిజానికి అంబానీలకు రెండు పార్టీలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా ఎన్డీయే ప్రభుత్వంలో లబ్ధి పొందారుంటూ అంబానీల కుటుంబంపై ఆరోపణలూ ఉన్నాయి. రఫేల్ కుంభకోణంలో ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ పేరు వినిపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాజకీయ ప్రచారాల్లో రఫేల్ ఒప్పందాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనిల్ అంబానీకి ప్రధాని అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు రాహుల్. ఈ తరుణంలో తండ్రి కాంగ్రెస్కు మద్దతు... భాజపా సభలో తనయుడు అనంత్ అంబానీ ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది.

అయితే... మిళింద్ దేవరాతో ఉన్న వ్యక్తిగత అనుబంధం నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ ఆయనకు మద్దతు పలికినట్లు చెబుతున్నారు. ''మిలింద్ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.'' అంటూ ముకేశ్ మాట్లాడిన వీడియోను దేవరా ట్విటర్లో పోస్ట్ చేశారు కూడా.

మిళింద్‌కు మద్దతుగా ముకేశ్ అంబానీ వీడియోలో మాట్లాడడం అనేది బీజేపీ ఓడిపోతుందనడానికి సూచిక అని నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వంటివారు చెబుతుండగా... 2014లోనూ ముకేశ్.. మిళింద్‌కే మద్దతు తెలిపారని.. అయినా, ఆయన, కాంగ్రెస్ రెండింటికీ ఓటమి తప్పలేదని మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత ఫడణవీస్ అంటున్నారు.

అయితే... మిళింద్‌కు ముకేశ్ బాహాటంగా మద్దతు తెలపడం కాస్త చర్చకు దారితీయడంతో ఇప్పుడు బ్యాలన్స్ కోసం అనంత్ అంబానీని మోదీ ర్యాలీకి పంపించి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది. ఆ ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్న అనంత్ మోదీ ప్రసంగం పూర్తికాగానే జనంతో పాటు మోదీ మోదీ.. చౌకీదార్ అంటూ నినాదాలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English