మోదీ బల ప్రదర్శన!... బెనార‌స్‌లో భారీ ర్యాలీ

మోదీ బల ప్రదర్శన!... బెనార‌స్‌లో భారీ ర్యాలీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న నామినేష‌న్ కు స‌న్నాహ‌కంగా గురువారం వార‌ణాసిలో నిర్వ‌హించిన ర్యాలీతో ఆ న‌గ‌రం న‌మో నినాదాల‌తో నిజంగానే మారుమోగిపోయింది. గ‌త ఎన్నికల్లో వార‌ణాసితో పాటు త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ లోని వాణిజ్య రాజ‌ధాని అహ్మ‌దాబాద్ నుంచి పోటీకి దిగిన మోదీ... ఈ ద‌ఫా మాత్రం ఒక్క వార‌ణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఈ ప‌విత్ర న‌గరంపై ఎంతో మ‌క్కువ చూపే ప్ర‌ధాని... గ‌త ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతోనే గెలిచారు. ఈ క్ర‌మంలో సొంత న‌గ‌రం అహ్మ‌దాబాద్ సీటును వ‌దిలేసుకున్న మోదీ... వార‌ణాసినే త‌న పోటీకి కేంద్రంగా నిర్దేశించుకున్నారు. ఈ సారి కూడా బంప‌ర్ విక్ట‌రీ ఖాయ‌మ‌న్న భావ‌న‌తోనే ఉన్న మోదీ... ప్ర‌త్యర్థి పార్టీల్లోని ప్ర‌ధాన నేత‌లు వార‌ణాసి వైపు క‌న్నెత్తి చూసేందుకు కూడా సాహ‌సించ‌ని రీతిలో మోదీ మోత మోగిస్తున్నారు. శుక్ర‌వారం నామినేష‌న్ వేయ‌నున్న మోదీ... దానికి స‌న్నాహ‌కంగా గురువారం న‌గ‌రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

న‌గ‌రంలోని బెనార‌స్ హిందూ విశ్వ విద్యాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద ఉన్న పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాళ‌వీయ విగ్ర‌హానీకి పూల మాల వేసి ర్యాలీని ప్రారంభించిన మోదీ.. న‌గ‌రం మొత్తాన్ని దాదాపుగా స్తంభింప‌జేశార‌నే చెప్పాలి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు పార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌రః నేత‌లు, ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల నేత‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న ఈ యాత్ర‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు న‌మో మంత్రాన్ని మారు మోగించారు. అయితే మోదీ మేనియాను ముందే ప‌సిగట్టిన పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జాం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే... ఎలాగూ రోడ్ల‌న్నీ క‌మ‌ల‌నాథుల‌తోనే నిండిపోతాయ‌న్న భావ‌న‌తో జ‌నం కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేద‌నే చెప్పాలి. మొత్తంగా నామినేష‌న్ సంద‌ర్భంగా పెద్ద‌గా జ‌న సందోహం వ‌ద్దనుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ... నామినేష‌న్ ముందు రోజు మోదీ... వార‌ణాసిలో త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించార‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English