కేసీఆర్‌ను బుక్ చేసేందుకు ఆయ‌న్ను రంగంలోకి దింపిన రేవంత్‌

కేసీఆర్‌ను బుక్ చేసేందుకు ఆయ‌న్ను రంగంలోకి దింపిన రేవంత్‌

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు సృష్టిస్తున్న ర‌చ్చ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, త‌ల్లిదండ్రులు ఆందోళనకు దిగడం నిత్య‌కృత్యం అవుతోంది. భారీ ఎత్తున విద్యార్థులు, త‌ల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు దగ్గరకు వస్తుండటంతో.. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. అరెస్టులు సహ‌జం అయిపోయింది. బోర్డు చుట్టుపక్కల ఎవరూ ఉండొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే వారికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. వీరిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, బీజేపీ, వామ‌ప‌క్షాల నేత‌లు సైతం రోడ్డెక్కారు.

అయితే, ఈ త‌ర‌హా ఆందోళ‌నలు విఫ‌లం అవుతున్న నేప‌థ్యంలో టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క అడుగు వేశారు. గవర్నర్ ఈఎస్ఎల్‌ నరసింహన్‌కు బహిరంగ లేఖ రాశారు. కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఈ లేఖ ద్వారా గ‌వ‌ర్న‌ర్ జోక్యం కోరారు. ప్ర‌భుత్వ పెద్ద‌గా రంగ ప్ర‌వేశం చేయాల‌ని రేవంత్ ఈ లేఖ‌లో కోరారు. త‌ద్వారా ప్ర‌భుత్వం స్పందించ‌ని త‌రుణంలో...గ‌వ‌ర్న‌ర్ త‌లుపుత‌ట్టామ‌నే సందేశం పంపారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం స్పంద‌న త‌ప్ప‌నిస‌రి అయ్యే ప‌రిస్థితిని రేవంత్ రెడ్డి క‌ల్పించారు.

రేవంత్ రెడ్డి లేఖసారాంశం ఇది``ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాల పట్ల తీవ్ర ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 9.70 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ నెల 18న ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడించింది. ఫలితాలలో తాము ఫెయిల్ అయినట్టు తెలుసుకున్న కొందరు విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలకు ఒడిగట్టారు. ఏడాది పాటు కష్టపడి చదవినా పరీక్షలో ఫెయిల్ కావడం ఏమిటన్న మానసిక క్షోభ వారిని ఆత్మహత్యలకు పురిగొల్పింది. విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోన్న సమయంలో కొన్ని నివ్వేరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయారని చెప్పడానికి విచారిస్తున్నాను. తమ బిడ్డల భవిష్యత్ పై ఆందోళనతో గడచిన వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు వేలాదిగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి తరలివస్తున్నారు. అసలు ఏం జరిగిందో? తమ బిడ్డల ఫలితాల విషయంలో పొరపాటు ఎక్కడ జరిగిందో? తెలుసుకునేందుకు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. వారికి అధికారుల నుంచి నిర్లక్ష్య పూరిత స్పందన లభిస్తోంది. పైగా పోలీసుల నిర్భందంతో వాళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరుగుతోన్న అన్యాయం విషయంలో ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతారాహిత్య ప్రకటనలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఫలితాలలో తప్పులు జరిగాయని ఓ వైపు బోర్డు కార్యదర్శి అశోక్ అంగీకరిస్తుంటే... మరోవైపు ఇదంతా అపోహమాత్రమే అని మంత్రి కొట్టిపారేస్తున్నారు. చేయని పాపానికి ఈ భారం వాళ్లెందుకు భరించాలి? రాష్ట్రంలోని యూనివర్సిటీలకు మీరు ఛాన్సిలర్. గాడితప్పిన విద్యావ్యవస్థను దారిలో పెట్టడానికి మీ జోక్యం అవసరం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడండి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించుకుని మీరే స్వయంగా మాట్లాడండి. అప్పుడే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబందిత విద్యాశాఖ అధికారులతో తక్షణం పరిస్థితిని సమీక్షించండి. ఆందోళనలో ఉన్న విద్యార్థుల భవిష్యత్ కు భరోసా ఇస్తూ, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.`` అని లేఖ‌లో ప్ర‌స్తావించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English