ఈసారి తోఫాకు చంద్ర‌న్న పెట్టాలా? వ‌ద్దా?

ఈసారి తోఫాకు చంద్ర‌న్న పెట్టాలా?  వ‌ద్దా?

రంజాన్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చంద్ర‌న్న తోఫా పేరుతో స‌రుకుల కిట్ ఇవ్వ‌టం తెలిసిందే. గ‌డిచిన కొన్నేళ్లుగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ అధికారుల‌కు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఈసారి పంపిణీ చేయాల్సిన రంజాన్ తోఫాకు ముందు చంద్ర‌న్న పేరు పెట్టాలా?  వ‌ద్దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని తేల్చుకోలేక‌పోతున్నారు. జూన్ 5న రంజాన్ ప‌ర్వ‌దినంగా భావిస్తున్నారు. పండ‌క్కి ఐదారు రోజులు ముందు తోఫాను ఇవ్వ‌టం స‌ముచితం. మ‌రి.. ఆ ఏర్పాట్లు చేయాలంటే ఇప్ప‌టి నుంచే చేప‌ట్టాలి. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. తోఫా ముందు చంద్ర‌న్న పేరు పెట్ట‌టం స‌రైన‌దేనా? అన్న క్వ‌శ్చ‌న్ ఒక‌టైతే.. మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్న నేప‌థ్యంలో.. పేరు పెట్ట‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎన్నిక‌ల కోడ్ కు ఎలాంటి ఇబ్బంది రాని ప‌క్షంలో చంద్ర‌న్న తోఫా అని పేర్కొన‌టం త‌ప్పే కాద‌ని.. ఎన్నిక‌ల సంఘం నుంచి క్లియ‌రెన్స్ వ‌స్తే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. కానీ.. అస‌లు ఇబ్బంది మ‌రొక‌టి ఉందంటున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఇప్పుడున్న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక‌వేళ‌.. జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

జ‌గ‌న్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌న్న పేరుతో తోఫా ఇవ్వ‌టానికి స‌సేమిరా అన‌టం ఖాయం. అలాంట‌ప్పుడు ముందుగా త‌యారు చేసిన సంచుల మాటేమిటి? అన్న‌ది ఒక ప్ర‌శ్న. ఒక‌వేళ ఫ‌లితాల మీద క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత ప్రింటింగ్ ఆర్డ‌ర్ ఇద్దామంటే.. త‌క్కువ స‌మ‌యంలో దాదాపు 12 ల‌క్ష‌ల సంచుల్ని ప్రింట్ చేయ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక సివిల్ స‌ప్లై అధికారులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English