సినిమా వాళ్లు ఒక్కరికీ దమ్ము లేదా?

సినిమా వాళ్లు ఒక్కరికీ దమ్ము లేదా?

తెలుగు ఫిలిం సెలబ్రెటీలందరూ ఉండేది హైదరాబాద్‌లో. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ తప్పు జరిగినా స్పందిస్తారు. అవసరమైన ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అక్కడి ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తారు. కానీ తాము ఉంటున్న రాష్ట్రంలో మాత్రం ఏ తప్పు జరిగినా స్పందించరు. ప్రభుత్వ అధినేతల్ని పొగడ్డానికి మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడతారు. కానీ ప్రశ్నించడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. ఇక్కడ ప్రతిపక్షం పని ఖాళీ. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీల్లో ఎమ్మెల్యేలు ఎవరినీ మిగలనీయట్లేదు. అందరినీ తమ పార్టీలోనే కలిపేసుకుంటున్నారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తున్నారు. ప్రజా సంఘాలు సైతం ఇక్కడ ఇన్ యాక్టివ్ అయిపోయాయి. ఇక సెలబ్రెటీల సంగతి సరేసరి.

మిగతా విషయాల సంగతి వదిలేద్దాం. తెలంగాణ ఇంటర్మీడియబ్ బోర్డు నిర్లక్ష్య వైఖరికి 15 మందికి పైగా విద్యార్థులు బలయ్యారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఐతే దీని గురించి స్పందించడానికి సెలబ్రెటీలకు భయం. దీని గురించి సోషల్ మీడియాలో రగడ నడుస్తుంటే వరుసబెట్టి ఒక్కొక్కరుగా.. విద్యార్థులకు ధైర్య వచనాలు చెప్పడం మొదలుపెట్టారు. అవన్నీ టెంప్లేట్ మెసేజుల్లా ఉన్నాయి. అందరూ తల్లిదండ్రులు మారాలి.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అనేవాళ్లే కానీ.. దారుణంగా విఫలమైన వ్యవస్థను, ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఏపీలో తమ కాలేజీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని.. రోడ్డెక్కి ధర్నా చేసిన మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ప్రస్తుత విషాదం నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఒక్క మాటా అనలేదు. ఇంకే ఫిలిం సెలబ్రెటీ కూడా స్పందించలేదు. అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దునుమాడేస్తారు. పవన్ కళ్యాణ్‌ను తిడతారు. మోడీని కూడా విమర్శించగలరు. కానీ తాము ఉంటున్న చోట ప్రభుత్వ విఫలమైతే ఇదేం న్యాయం అని నిలదీసే దమ్ము మాత్రం ఎవ్వరికీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English