కేసీఆర్‌కు గుడ్ న్యూస్‌...కోదండ‌రాం సొంత కుంప‌టి

కేసీఆర్‌కు గుడ్ న్యూస్‌...కోదండ‌రాం సొంత కుంప‌టి

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో...తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఒకింత ఊహించ‌ని క‌బురు వినిపించింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేడి త‌గ్గ‌కుండానే వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఐక్య‌తకు ఆదిలోనే బ్రేక్ ప‌డింది. క‌లిసిక‌ట్టుగా సాగుతాయ‌నుకున్న పార్టీల కూట‌మి క‌ట్ట‌కుండానే సొంత కుంప‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. రాష్ట్రంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సార‌థ్యంలో కూటమి ఏర్పాటు కావ‌డం అయ్యే ప‌ని కాద‌ని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 3 దశల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించ‌నున్నారు. మే 6, 10, 14 తేదీల్లో జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యుల ఎన్నికలు జరుగనున్నాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల కౌంటింగ్ మే 27న జరుగుతుంది. ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు విప‌క్షాలు కూట‌మి క‌డ‌తాయ‌ని భావించారు. కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, వామ‌పక్షాలు, టీజేఎస్ క‌లిసి పోరాటం చేస్తాయ‌ని అంచ‌నావేశారు. అయితే, దీనికి బ్రేక్ వేస్తూ కోదండ‌రాం త‌మది ప్ర‌త్యేక పోరు అని ప్ర‌క‌టించారు.

టీజేఎస్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయ‌నుంద‌నే సందేహం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే, టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తు కోసం, కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అలాంటి స‌మ‌యంలో టీజేఎస్ తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వామ‌ప‌క్ష పార్టీల స్పంద‌న‌ను బ‌ట్టి విపక్ష కూటమి ఏర్పాటు కానుందా లేదా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త రానుంది. కాగా, ప్ర‌తిప‌క్షాల అనైక్య‌త అధికార టీఆర్ఎస్ పార్టీకి తీపిక‌బురు వంటిదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English