హాట్ టాపిక్.. పవన్ కళ్యాణ్ ఐటీ డిగ్రీ

హాట్ టాపిక్.. పవన్ కళ్యాణ్ ఐటీ డిగ్రీ

తనకు చదువు సరిగా అబ్బలేదనే విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరచుగా ప్రస్తావిస్తుంటాడు. తాను ఇంటర్ ఫెయిలైన విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. ఐతే ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఇప్పుడు దీనికి భిన్నంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వరుసగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక వీడియో సందేశం ఇచ్చారు.

పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా ప్రొజెక్ట్ చేస్తున్నారరంటూ తల్లిదండ్రులతో పాటు ఎడ్యుకేషన్ సిస్టం పట్ల నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అన్నదమ్ములపై తల్లిదండ్రులు చదువు విషయంలో ఎప్పుడూ ఒత్తిడి తేలేదని అన్నాడు.

తమ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి క్వాలిఫికేషన్లు ప్రస్తావించాడు. చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సోదరీమణుల్లో ఒకరు ఎంబీబీఎస్‌, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని.. తాను ఎల్ఎల్‌బీ చేశానని చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. అతను ఐటీలో డిగ్రీ హోల్డర్ అన్నాడు. సరిగ్గా నాగబాబు మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘కల్యాణ్‌ బాబేమో అదర్‌ దెన్‌ హిజ్‌ ఇంటర్మీడియట్‌.. తను కొన్ని ఐటీ సబ్జెక్ట్స్‌ పూర్తి చేసి.. ఐటీ డిగ్రీ హోల్డర్‌ అతను’’ అని అన్నాడు.

స్వయంగా పవన్ కళ్యాణే తాను ఇంటర్ ఫెయిల్ అన్నాడు. ఇటీవల గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి మాత్రమే పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నాడు. మరి నాగబాబు మాత్రం పవన్ ఇంటర్మీడియట్‌ పూర్తయినట్లు చెప్పడమే కాక.. ఐటీ డిగ్రీ అంటూ పొంతన లేని విధంగా మాట్లాడాడు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ ఓ ఇంటర్మీడియట్‌ కాలేజీలో తాను రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పాడు. ఇంకో సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లానని అన్నాడు. అది గందరగోళానికి దారి తీసింది. ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలతో మరోసారి పవన్ చదువు విషయం చర్చనీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English