అయితే.. ఈ సారి మంత్రి వ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట‌..!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాధాన్యాలు మారుతున్నాయా ?  ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచింది ఒక ఎత్తు.. ఇక నుంచి గ‌డిచేది మ‌రో ఎత్తు..! అనే వ్యూహంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారా ? అంటే.. అవున‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయులైన నాయ‌కులు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ పోరు ఒక ఎత్తు. అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఎదుర్కొనబోయే ముఖ చిత్రం మ‌రో ఎత్తుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ క‌లిసిపోయే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న పాల‌న తాలూకు ప్ర‌భావం ఒక్క‌టే ప‌నిచేయ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ప‌థ‌కాలు కూడా ప్ర‌భావం చూపించినా.. అంత‌కుమించి.. ఏదైనా చేయ‌క‌పోతే అన్ని పార్టీలు క‌లిసి ఏర్పాటు చేసుకునే మ‌హాకూట‌మిని ఎదుర్కొన‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. జ‌గ‌న్‌.. త‌న మంత్రి వ‌ర్గంలో ఐదారు స్థానాలు మ‌హిళ‌ల‌తోనే భ‌ర్తీ చేయాల‌నే సంచ‌ల‌న ఆలోచన చేస్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ముగ్గురు మంత్రులు మాత్ర‌మే మ‌హిళ‌లు ఉన్నారు. వారిలో హోం మంత్రి కూడా ఉన్నారు. నిజానికి ఇది ఒక రికార్డే. అయిన‌ప్ప‌టికీ.. ఈ మోతాదు చాల‌ద‌ని.. ఇంకా డోస్ పెంచాల‌ని.. అనుకుంటున్నార‌ట‌. జ‌గ‌న్.

అంటే.. మొత్తంగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆఖ‌రుకు మ‌హిళా సీఎం ఉన్న ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలోనూ మ‌హిళ‌ల‌కు ద‌క్క‌ని గౌర‌వాన్ని ప‌ద‌వుల‌ను తాను ఇవ్వ‌డం ద్వారా.. రాష్ట్రంలోని అన్ని సామాజిక వ‌ర్గాల మ‌హిళా మ‌ణుల‌ను ఆక‌ర్షించి.. చ‌రిత్ర సృష్టించాల‌ని.. దానిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం ద్వారా.. ఎన్ని పార్టీలు ఏకమైనా.. త‌న‌కు తిరుగులేని విజ‌యం ద‌క్కించుకునేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీలో తొలి రోజు మ‌హిళా సాధికార‌త‌పై చ‌ర్చ‌ను పెట్టార‌ని.. దీనిలో పాల్గొన్న మ‌హిళా ఎమ్మెల్యేల్లో ఎవ‌రెవ‌రు ఎలా మాట్లాడుతున్నార‌నే విష‌యాన్ని ఆయ‌న నమోదు చేసుకున్నార‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంటున్నారు. మ‌రి ఇదే జ‌రుగుతుందా?  అలా జ‌రిగితే. ఇక‌, దేశంలోనే ఏపీ మ‌రో రికార్డును సొంతం చేసుకున్న‌ట్టే అవుతుంది. అలాగే మ‌హిళా ఎమ్మెల్యేల పంట కూడా పండిన‌ట్టే అవుతుంది.