సీఎల్పీ అడ్రెస్ గ‌ల్లంతే!... ఆ ఆరుగురు ఎక్క‌డికెళ్లాలి?

సీఎల్పీ అడ్రెస్ గ‌ల్లంతే!... ఆ ఆరుగురు ఎక్క‌డికెళ్లాలి?

జూన్ లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవకాశాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. అప్ప‌టిలోగానే రాష్ట్రంలో కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకునే అవకాశాలూ లేక‌పోలేద‌న్న వార్త‌లు ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ప‌రిణామాల్లో కీల‌క ప‌రిణామంగా ప‌రిగ‌ణిస్తున్న ప‌రిణామంపై టీ కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది.

టీఆర్ఎస్ అనుకున్న‌ట్లుగా ఈ ప‌రిణామ‌మే చోటుచేసుకుంటే... అస‌లు అసెంబ్లీలో టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో పాటు ఆరుగురి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది పెద్ద ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతోంది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది.

ఈ 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే ఓ ప‌ది మంది ఎమ్మెల్యేలు హ‌స్తం పార్టీకి చేయిచ్చేసిన కారెక్కేశారు. ఇక మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల్లో గండ్ర వెంట‌క‌ర‌మ‌ణారెడ్డి, తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి), పొదెం వీర‌య్యలు టీఆర్ఎస్ లో చేరిపోయేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఈ నెల 24న వీరు టీఆర్ఎస్ లో చేరిపోవ‌డం ఖాయ‌మేన‌ని తెలుస్తోంది.

వీరు కూడా టీఆర్ఎస్ లో చేరిపోతే... ఇక కాంగ్రెస్ పార్టీకి నిక‌రంగా మిగిలే ఎమ్మెల్యేల సంఖ్య ఆరు మాత్ర‌మే. అంటే అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కూడా కాంగ్రెస్ కోల్పోతుంద‌న్న మాట‌. ఇదే స్పీడును కంటిన్యూ చేయాల‌ని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వేగంగా పావులు క‌దుపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేసిన కేసీఆర్‌... వారితోనే సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలంటూ స్పీక‌ర్‌కు లేఖ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ పార్టీకి సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ త‌ర‌హా లేఖ ఇస్తే... స్పీక‌ర్ కూడా అందుకు అనుగుణంగానే వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌దన్న వాద‌న ఉంది క‌దా.

మ‌రి కాంగ్రెస్ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (సీఎల్పీ)ని టీఆర్ఎస్ లో విలీనం చేసేస్తే... కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంకా ఆ పార్టీలోనే కొన‌సాగుతున్న ఉత్త‌మ్ స‌హా ఆరుగురి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోన్న అంశంగా మారిపోయింది. అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యేలోగానే ఈ ప‌రిణామం పూర్తి అయితే... కాంగ్రెస్ కొంప కొల్లేరైన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English