ఎన్ని సీట్ల‌లో గెలుస్తామంటే...ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర స్పంద‌న‌

ఎన్ని సీట్ల‌లో గెలుస్తామంటే...ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర స్పంద‌న‌

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత తొలి సారిగా పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత పార్టీ తరఫున మొదటి సమావేశం ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ నేత‌ల‌తో భేటీ అవుతార‌ని భావించిన‌ప్ప‌టికీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగిన యువ అభ్య‌ర్ధుల‌తోనే ముఖాముఖి స‌మావేశం అయ్యారు. పోలింగ్ సంద‌ర్బంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది... ఈ ప్ర‌కియను ఇలాగే కొన‌సాగిద్దాం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పిలుపునిచ్చారు. ``ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే వైసీపీ మాకు 120 స్థానాలు వ‌స్తాయంటే, టీడీపీ మాకు ఇన్ని స్థానాలు వ‌స్తాయంటూ లెక్క‌లు వేయ‌డం మొద‌లుపెట్టాయి, మ‌నం మాత్రం అలా లెక్క‌లు వేయం. ఓటింగ్ స‌ర‌ళి ఎలా జ‌రిగిందో తెలుసుకోమ‌ని మాత్ర‌మే పార్టీ నాయ‌కుల‌కు చెప్పా.

మార్పు చిన్న‌గానే మొద‌ల‌వుతుంది. ఇది మ‌నం ఎదిగే దశ. ఈ మార్పు ఎంత వ‌ర‌కు వెళ్తుందో తెలియ‌దు. నేను మిమ్మ‌ల్ని గుర్తించిన విధంగానే మీరు గ్రామ స్థాయి నుంచి నాయ‌కుల్ని  గుర్తించండి. నాయ‌కుల్ని త‌యారుచేయండి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇదే మార్పును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దాం. తెలంగాణ‌లో కూడా ఇదే త‌ర‌హా మార్పును ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారు`` అని వెల్ల‌డించారు.

స‌మాజాన్ని మార్చాల‌ని అంద‌రూ అనుకుంటారని, అయితే ముంద‌డుగు వేసే వారు త‌క్కువ అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``మార్పు కోసం ముందుకు వెళ్దామంటే స్నేహితులు, సొంత వారే మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్ని అధిగ‌మించి ఓ ముంద‌డుగు వేశాం. నిధులు, నియామ‌కాల వ్య‌వ‌హారంలో తేడా వ‌చ్చిన‌ప్పుడే ఉద్య‌మాలు పుడ‌తాయి. తెలంగాణ ఉద్య‌మం కూడా అలా పుట్టిందే. ప్ర‌తి చోటా రెండు కుటుంబాలే అంతా ఆప‌రేట్ చేస్తూ వ‌స్తున్నాయి.

ఎవ‌రికి నిధులు వెళ్లాలి, నీరు ఎవ‌రికి వెళ్లాలి అనే విష‌యం కూడా వారే ఆప‌రేట్ చేస్తున్నారు. అదే అంశం మీద ఫైట్ చేద్దామ‌నిపించింది. మార్పు రావాలంటే ముందు భ‌య‌ప‌డ‌కూడ‌దు. అలాంటి మార్పు యువ‌త‌తోనే సాధ్యం అన్న న‌మ్మ‌కంతో ముందుకు వెళ్లాను అని అన్నారు.ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని చెప్పారు. రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది... ఈ ప్ర‌కియను ఇలాగే కొన‌సాగిద్దాం అని  పిలుపునిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English