కాంగ్రెస్‌కు కేసీఆర్ దొరికిన‌ట్టేనా?

కాంగ్రెస్‌కు కేసీఆర్ దొరికిన‌ట్టేనా?

చిక్క‌డు, దొర‌క‌డుగా సాగుతున్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావును హ‌స్తం పార్టీ నేత‌లు ఎట్టకేల‌కు గ‌ట్టిగానే ప‌ట్టేసిన‌ట్టున్నారు. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న ఎన్నిక‌ల కోడ్ ను కేసీఆర్ ఉల్లంఘించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఈ వ్య‌వ‌హారంపై ఏకంగా లోక్ పాల్ కు ఫిర్యాదు చేస్తామంటూ డేంజ‌ర్ బెల్స్ మోగించింది. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆరోప‌ణ‌లు ఏదో ఆషామాషీగా చేస్తున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... కేసీఆర్ ఏఏ సంద‌ర్భాల్లో ఎక్క‌డెక్కడ కోడ్ ను ఉల్లంఘించార‌న్న విష‌యాల‌పై ప‌క్కా ఆధారాలు సేకరించిన మీద‌టే కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యంపై ప్ర‌త్య‌క్ష పోరుకు సిద్ధ‌మైపోయిందని తెలుస్తోంది.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గానే... కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ స‌ర్కారు ఇద్ద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధించిన భూముల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తూ ఏకంగా అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసిందట‌. ఈ రెండు ఘ‌ట‌న‌లూ ఖ‌మ్మం జిల్లా ప‌రిధిలోనే జ‌ర‌గ‌గా.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యాల ద్వారా లబ్ది పొందిన వారిలో టీడీపీ టికెట్ పై స‌త్తుప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య, గ‌తంలోనే టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి టీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా ఎన్నికైన పువ్వాడ అజ‌య్ కుమార్‌లు ఉన్నారు.

ఈ ఇద్ద‌రిలో పువ్వాడ విష‌యానికి వ‌స్తే... దాదాపు రూ.100 కోట్ల విలువైన భూమిని పువ్వాడ ఆక్ర‌మిస్తే... దానిని రెగ్యుల‌రైజ్ చేయాలంటూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశార‌ట‌. పువ్వాడ కాంగ్రెస్ లో ఉన్న స‌మ‌యంలోనూ ఈ విష‌యంలో ఆయ‌న పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. నాడు టీఆర్ఎస్ స‌ర్కారు కూడా ఇదే విష‌యంలో పువ్వాడ‌ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పువ్వాడ‌... టీఆర్ఎస్ లో చేరిపోగానే... నాలాను పూడ్చేసి ఆక్ర‌మించిన భూమిని ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాలంటూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఇక సండ్ర విష‌యానికి వ‌స్తే... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అడ్డంగా బుక్కైన ఓటుకు నోటు కేసులో కీల‌క నిందితుడు. రేవంత్ రెడ్డి మాదిరే సండ్ర కూడా జైలుకు వెళ్లి వ‌చ్చిన వారే. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ రెండు సీట్లు గెలిస్తే... వాటిలో స‌త్తుప‌ల్లి నుంచి సండ్ర గెలిచిన సీటు ఒక‌టి.

ఆది నుంచి టీడీపీకి విధేయుడిగా ఉన్న సండ్ర‌... మొన్న‌టి ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ కు విధేయుడిగా మారిపోయారు. లేదులేదంటూనే టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఖ‌మ్మంలో రూ.5 కోట్ల విలువ చేసే వెయ్యి గ‌జాల స్థలాన్ని ఆయ‌న‌కు రెగ్యుల‌రైజ్ చేయాల‌ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఇందుకోసం సండ్ర కేవ‌లం రూ.50 ల‌క్ష‌లు చెల్లిస్తే స‌రిపోతుంద‌ట‌. మొత్తంగా ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో ప‌క్కా ఆధారాలు సేక‌రించిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై త్వ‌ర‌లోనే ఢిల్లీకి వెళ్లి లోక్ పాల్ కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే జ‌రిగితే.... కాంగ్రెస్ ను నానా ఇబ్బందుల పాల్జేస్తున్న కేసీఆర్ ఆ పార్టీకి అడ్డంగా బుక్కైన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English