జేడీని విజయసాయి వైకాపాలోకి ఆహ్వానించాడా?

జేడీని విజయసాయి వైకాపాలోకి ఆహ్వానించాడా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీ కీలక నేత ఒకరు ఆహ్వానించారంటే నమ్మగలమా? కానీ ఇది నిజం అని స్వయంగా లక్ష్మీనారాయణే వెల్లడించడం విశేషం. జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైకాపాలో నంబర్ 2 అనదగ్గ విజయ్ సాయిరెడ్డికి, లక్ష్మీనారాయణకు ట్విట్టర్లో వాగ్వాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్న తరుణంలో లక్ష్మీనారాయణ గురించి ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు విజయ సాయిరెడ్డి.  ‘‘జేడీ గారూ… మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి… నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి…ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా… ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?’’ అని విజయ్ సాయిరెడ్డి ట్వీట్ చేశాడు.

దీనికి లక్ష్మీనారాయణ బదులిస్తూ.. ‘‘గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారికి, నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపిన విషయం అనేక టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో నేనే స్వయంగా చెప్పాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, మీరే మీ పార్టీలో నాకు ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తానన్న విషయం మీరు ఎక్కడా బహిర్గతం చేయట్లేదు. దీనిబట్టి మీరు ఎన్ని విషయాలు ప్రజల దగ్గర దాస్తున్నారో తెలుస్తుంది. మీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను మరో రూపంలో వ్యక్తం చేస్తున్నారా?’’ అని కౌంటర్ ఇచ్చారు.

ఐతే తనను జైలుకు పంపడంలో కీలకంగా వ్యవహరించిన జేడీని విజయ్ సాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మాట వరసకైనా ఆహ్వానించడానికి జగన్ ఎలా ఒప్పుకుని ఉంటాడన్నది అర్థం కాని విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English