సాయిరెడ్డికి జేడీ సిసలైన కౌంట‌ర్ !

సాయిరెడ్డికి జేడీ  సిసలైన కౌంట‌ర్ !

వైసీపీ కీల‌క నేత‌, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి నిత్యం ట్విట్ట‌ర్ వేదిక‌గా య‌మా యాక్టివ్ గా ఉంటున్న విష‌యం తెలిసిందే క‌దా. ప్ర‌ధానంగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నార లోకేశ్ ల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ట్వీట్ల‌ను చేసే సాయిరెడ్డి....  నిజంగానే ఇప్పుడు అదిరిపోయే రిట‌ర్న్ పంచ్ లో విల‌విల్లాడిపోయే ప‌రిస్థితి కొనితెచ్చుకున్నార‌ని చెప్పాలి. ఎప్పుడైనా త‌న‌దే పైచేయిగా ఉండాల‌న్న దిశ‌గా ఆలోచించే సాయిరెడ్డి... తాను ప్ర‌స్తావించే ప్ర‌తి విష‌యంపైనా స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తోనే బ‌య‌ట‌కు వ‌స్తుంటారు. అయితే మ‌నిష‌న్నాక‌... ఎప్పుడో ఒక‌ప్పుడు క‌ట్టు త‌ప్ప‌డం స‌హ‌జ‌మే క‌దా. అలాగే ఇప్పుడు సాయిరెడ్డి కూడా ప‌ట్టుబ‌డిపోయారు.

ఇలాంటి బ్ర‌హ్మాండ‌మైన అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారా? అన్న డౌట్లు రేకెత్తేలా సీబీఐ మాజీ జేడీ, జ‌న‌సేన విశాఖ ఎంపీ అభ్య‌ర్ధి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఎంట్రీ ఇచ్చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌గ‌న్ తో పాటు సాయిరెడ్డి, ప‌లువురు అదికారుల‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించింది ల‌క్ష్మీనారాయ‌ణే క‌దా. ఇప్పుడు తాను చేసిన జ‌న‌సేన విజ‌యంపై  ఓ ప్ర‌క‌ట‌న‌ను అవహేళ‌న చేస్తూ సాయిరెడ్డి సంధించిన ట్వీట్ ను ఆధారం చేసుకుని ల‌క్ష్మీనారాయ‌ణ త‌న‌దైన శైలిలో రెచ్చిపోయార‌నే చెప్పాలి. సాయిరెడ్డివి అన్నీ త‌ప్పుడు లెక్క‌లే. సాయిరెడ్డి త‌ప్పుడు లెక్క‌ల వ‌ల్లే అనేక మంది కేసుల్లో ఇరుక్కున్నారంటూ ఆయ‌న త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సాయిరెడ్డి నిత్యం క‌నిపించే ట్విట్ట‌ర్ వేదిక‌గానే ల‌క్ష్మీనారాయ‌ణ ఈ కౌంట‌రిచ్చారు.

స‌ద‌రు ట్వీట్ లో ల‌క్ష్మీనార‌య‌ణ ఏమ‌న్నారంటే... *గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి. మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి* అంటూ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. మొత్తంగా ఈ త‌ర‌హా సెటైరిక్ కామెంట్ ఇప్ప‌టిదాకా సాయిరెడ్డికి ఎదురు కాలేద‌నే చెప్పాలి. ఈ గూబ  గుయ్యిమ‌నేలా దూసుకువ‌చ్చిన మాజీ జేడీ పంచ్ పై సాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English