అసెంబ్లీ ఎన్నిక‌లెప్పుడైనా... ర‌జ‌నీ రెడీనేన‌ట‌!

అసెంబ్లీ ఎన్నిక‌లెప్పుడైనా... ర‌జ‌నీ రెడీనేన‌ట‌!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌రోమారు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. నిత్యం అక్క‌డి రాజ‌కీయాలు దేశ‌వ్యాప్త దృష్టిని ఆక‌ర్షిస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. దేశంలో మొత్తం 543 లోక్ స‌భ స్థానాల‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండగా... ఎక్క‌డ ర‌ద్దు మాట లేదు గానీ... ఒక్క త‌మిళ‌నాడు లోని వేలూరు లోక్ స‌భ ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనిని బ‌ట్టి త‌మిళ రాజ‌కీయం ఎంత ర‌స‌వ‌త్త‌ర‌మో ఇట్టే చెప్పేయొచ్చు. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సంబంధించి త‌మిళ‌నాట నిన్న పోలింగ్ ముగియ‌గా... వాటితో పాటు ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ సీట్ల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక మ‌రో నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. ఈ మొత్తం 22 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు త‌మిళ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాల‌కు తెర లేపే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ వాద‌న నిజ‌మేన‌న్నట్లు ప్రముఖ సినీ న‌టుడు, త‌మిళ తంబీలంతా త‌లైవా అంటూ అభిమానంగా పిలుచుకునే ర‌జ‌నీకాంత్.. ఈ ప‌రిణామాల‌పై సంచ‌ల‌న ప్ర‌కట‌న చేశారు. ఇప్ప‌టికే రాజ‌కీయ తెరంగేట్రం చేసిన ర‌జ‌నీ... ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక‌పై అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా... పోటీ చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌కట‌న చేశారు. అసెంబ్లీకి జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌లైనా, మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లైనా కూడా తాను పోటీ చేయ‌డం ఖాయ‌మేన‌ని, తన పార్టీ పూర్తి స్థాయిలో పోటీలో ఉంటుంద‌ని కూడా ర‌జ‌నీ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న ఇప్పుడు త‌మిళ నాట పెను ప్ర‌కంప‌న‌లే రేపుతోంది. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చినా అని కూడా ర‌జ‌నీ ప్ర‌కటించ‌డంపై అప్పుడు పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి.

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు ఇప్పుడు జ‌రుగుగున్న అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు చావో రేవో అన్న‌ట్లుగా మారిపోయాయి. ఈ ఎన్నిక‌ల్లో విప‌క్షం డీఎంకేకే ఏమాత్రం ఫ‌లితాలు మొగ్గినా... అన్నాడీఎంకే స‌ర్కారు కుప్ప‌కూల‌డం ఖాయ‌మే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాట మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని, ఇప్ప‌టికే చాలా మంది అంచ‌నాలు వేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే ర‌జ‌నీ కూడా మ‌ధ్యంత‌రం మాట ప‌లికి ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న‌కు తానుగా మ‌ధ్యంత‌రం మాటను ర‌జ‌నీ ప్ర‌స్తావించ‌కున్నా... మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానమిచ్చిన సంద‌ర్భంగా సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు మ‌ధ్యంతర ఎన్నిక‌లొచ్చినా తాను పోటీ చేయ‌డం ఖాయ‌మంటూ ర‌జ‌నీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో చాలా కోణాలే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English