బాబు,జ‌గ‌న్‌..ఢిల్లీలో ఏపీ ప‌రువు తీస్తోంది ఎవ‌రు?

బాబు,జ‌గ‌న్‌..ఢిల్లీలో ఏపీ ప‌రువు తీస్తోంది ఎవ‌రు?

ఏపీ రాజ‌కీయం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయింది. హోరాహోరీగా జ‌రిగిన ఎన్నిక‌లు, జాతీయ స్థాయి నేత‌ల హాజ‌రు, పెద్ద ఎత్తున పోలింగ్ న‌మోద‌వ‌డం...ఇలా ఎన్నో ప్రత్యేక‌త‌లు న‌మోద‌య్యాయి. పెద్ద ఎత్తున ఓట్లు పోలయిన ఆనందం మిగలకుండా రాజకీయ పార్టీలు ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ తిరగడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఏపీ ప్రతిష్ట దిగజారుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తీరుతో ఏపీ గురించే ఢిల్లీలో హాట్ చ‌ర్చ. పోలింగ్ రోజు మొదలుకుని క్షణం విరామం లేకుండా ఎన్నికల సంఘంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి మంత్రులు, ఎంపీలను తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి చంద్రబాబు ఎన్నికల వ్యవస్థలో లోపాలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ ప్రయత్నం ఆరు నెలల ముందు చేసి ఉంటే బాగుండేదని కొంద‌రు పేర్కొంటున్నారు. తాము సైతం తక్కువ కాదన్నట్లు వైసీపీ ప్రతినిధి బృందం పోటాపోటీగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఢిల్లీ వీధుల్లో ఒకరినొకరు దూషించుకున్నారు.

అయితే, ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే- మరోవైపు ఎన్నికల సంఘం అధికారులను, పోలింగ్ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయ పార్టీలు మాట్లాడడం సరికాదని కొంద‌రు అంటున్నారు. పార్టీలు ఏవైనా తమకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు ఎన్నికల తీరుపై విమర్శలు గుప్పించడం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీల ధోరణి ఇంతే. ఇందులో చంద్రబాబును తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటే ఈవీఎంల గురించి ఎవరూ మాట్లాడరు. సాంకేతిక లోపాల గురించి ఐదేళ్ల దాకా ప్రస్తావించరు. అధికారం రాకుంటే ఈవీఎంల తీరును ప్రశ్నించడం పరిపాటిగా మారింది.  దేశవ్యాప్తంగా ఇంకా ఆరు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ పరిణామాలు దేనికి సంకేతం? అని ప‌లువురు వాపోతున్నారు.

మ‌రోవైపు ఏపీ విషయంలో ఎన్నికల కమిషన్ తీరును సైతం కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. పోలింగ్‌-కౌంటింగ్‌కు మధ్య వారం కంటే మించి వ్యవధి ఉండకుండా చూస్తే బాగుండేది. 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరపడం కూడా సరైన నిర్ణయం కాదని తేలిపోయింది. మూడు విడతలుగా ఎన్నికలు జరిపించి ఉంటే బాగుండేది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, రాయలసీమ ప్రాంతానికి మూడు దశల్లో పోలింగ్ జరిగి ఉంటే శాంతి భద్రతల పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. స్థూలంగా అనేక కార‌ణాలు ఫ‌లితం కావచ్చుకానీ ఇప్పుడు ఏపీ రాజ‌కీయం గ‌ల్లీ దాటి ఢిల్లీకి చేరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English