తమిళ స్టార్.. ఇప్పటికైనా ప్రభావం చూపుతాడా?

తమిళంలో రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్లను పక్కన పెడితే.. తర్వాతి లీగ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోల్లో శింబు ఒకడు. కాకపోతే ఆ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సరిగా ఉపయోగించుకోడనే విమర్శలు అతడిపై ఉన్నాయి. వ్యక్తిగతంగా అనేక వివాదాల వల్ల తన కెరీర్‌ ఎప్పుడూ ఒక పద్ధతిగా సాగలేదు. హీరోయిన్లలో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా శింబు వివాదాల గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది.

ఐతే ఈ మధ్య ఇలాంటి వ్యవహారాలన్నీ పక్కనపెట్టి కొంచెం కుదురుగా సినిమాలు చేస్తున్నాడు. బరువు కూడా బాగా తగ్గి ఫిజిక్ మీద కూడా అతను దృష్టిపెట్టాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన శింబు సినిమా ‘ఈశ్వరన్’ తమిళంలో మంచి ఫలితమే అందుకుంది. ఇప్పుడు ‘మానాడు’ అనే సినిమాతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

శింబుకు తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని ఎప్పట్నుంచో ఉంది. గతంలో కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. ‘మన్మథ’ సినిమాతో ఒక టైంలో అతడికి మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఆ తర్వాత చెత్త సినిమాలతో మన ప్రేక్షకుల్లో నమ్మకం కోల్పోయాడు. చాలా ఏళ్లుగా అతడి సినిమాలు ఇక్కడ రిలీజ్ కావడమే లేదు. ‘ఈశ్వరన్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నా కుదర్లేదు.

ఐతే ఇప్పుడు ‘మానాడు’ తెలుగు వెర్షన్ ‘లూప్’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో విలక్షణమైన సినిమాలకు పేరుపడ్డ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రమిది. సరోజ, గ్యాంబ్లర్, రాక్షసుడు లాంటి సినిమాలతో వెంకట్‌కు తెలుగులో ఓ మోస్తరుగానే గుర్తింపు ఉంది. తెలుగులో పెద్దగా సినిమాలు లేని ఈ వారాంతంలో ‘లూప్’ను చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మళ్లీ శింబు తెలుగులో మార్కెట్ గుర్తింపు పొందుతాడేమో చూడాలి.