మోదీకి మ‌ద్ద‌తుగా బాబా వ‌చ్చేశారు!

మోదీకి మ‌ద్ద‌తుగా బాబా వ‌చ్చేశారు!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌క స్థానాల‌కు ఎన్నిక‌లు ముంచుకొచ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ముగిసిన మొద‌టి విడ‌త ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌ముఖులు లేర‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోని కొన్ని స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగినా... అందులో పోటీ చేసిన వారిలో జాతీయ స్థాయి నేత‌లు లేర‌నే చెప్పాలి. గురువారం జ‌ర‌గ‌నున్న రెండో విడ‌త‌, ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న మూడో విడ‌త ఎన్నికలు జ‌రిగే ప్రాంతాల్లో హేమాహేమీల్లాంటి నేత‌లున్నారు. ఈ జాబితాలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌, ప్ర‌ముఖ న‌టులు రాజ్ బ‌బ్బ‌ర్‌, హేమామాలినీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్‌, సుశీల్ కుమార్ షిండే త‌దిత‌రులున్నారు.

ఈ క్ర‌మంలో బీజేపీ త‌న క్యాంపెయిన్‌ను మ‌రింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా బుధ‌వారం నాటి ప్ర‌చారంలో ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను రంగంలోకి దించింది. రాజ‌కీయాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని బాబా... పొలిటీషియ‌న్ల‌తో రాసుకుపూసుకుని తిరుగుతుంటారు. ఈ క్ర‌మంలో బీజేపీ నుంచి పిలుపు రాగానే ఎగేసుకుంటూ రంగంలోకి దిగిపోయిన బాబా... జైపూర్ లో బీజేపీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఫ‌క్తు బీజేపీ నేత‌ల కంటే కూడా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దేశ భ‌ద్ర‌త మోదీ చేతుల్లోనే భ‌ద్రంగా ఉంటుంద‌ని ఓ ఆస‌క్తిక‌ర కామెంట్ చేసిన బాబా... ఈ సారి కూడా మోదీనే గెలిపించుకోవాల‌ని పిలుపునిచ్చారు. మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దని దేశ వ్యతిరేక శక్తులు, ముస్లిం, క్రిస్టియన్‌ దేశాలు కోట్ల రూపాయలను సమకూర్చుతున్నాయ‌ని ఆరోపించిన బాబా..  అసలు మోదీ ఏం తప్పు చేశారని ప్ర‌శ్నించారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం పని చేయని మోదీని తిరిగి గెలిపించుకోవాల‌ని కోరారు.  కుటుంబంతో పాటు సొంత ఇల్లూ లేని మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంద‌ని బాబా త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. చూద్దాం మ‌రి బాబా ప్ర‌చారం మోదీ గెలుపున‌కు ఏ మేర దోహ‌ద‌ప‌డుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English