జేపీకి జేడీకి తేడా అదే..

జేపీకి జేడీకి తేడా అదే..

రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తి కేవలం మంచోడైతే సరిపోదు. దాని కంటే కూడా సమర్థత అనేది చాలా కీలకం. క్షేత్ర స్థాయిలోకి దిగి పని చేయకుండా.. కేవలం మైకుల ముందు వీర లెవెల్లో ప్రసంగాలు ఇస్తాం.. అద్భుతంగా మాట్లాడేస్తాం అంటే సరిపోదు. కేవలం ఈ ప్రసంగాలు చూసి ఎవ్వరూ ఇంప్రెస్ అయిపోరు. జనాల్ని నేరుగా కలవాలి. వాళ్లతో మాట్లాడాలి. సమస్యలు తెలుసుకోవాలి. ఒక నాయకుడు నేరుగా రంగంలోకి దిగితేే ఉండే ప్రభావమే వేరు. తెలుగు ప్రజల్లో విద్యావంతులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న లోక్ సత్తా పార్టీ ఫెయిల్ కావడానికి కారణాలేంటో అందరికీ తెలుసు. జయప్రకాష్ నారాయణ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడే. ఉన్నత ఆశయాలు ఉన్నవాడే. కానీ పార్టీ పెట్టాక ఆయన పెద్దగా ఎప్పుడూ క్షేత్ర స్థాయిలోకి దిగి పని చేసింది లేదు. అద్భుతమైన ప్రసంగాలైతే ఇచ్చాడు. కానీ పార్టీ పెట్టాక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తిరిగింది చాలా చాలా తక్కువ.

ఎమ్మెల్యే అయ్యాక కూడా జేపీ తన నియోజకవర్గంలో తిరగకపోవడం.. యాక్టివ్ పొలిటీషియన్‌లా ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జేపీ లాంటి వాడు ఎమ్మెల్యే అయితే అద్భుతాలు జరిగిపోతాయని అందరూ ఆశించారు. పార్టీ గొప్పగా పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆయన సగటు రాజకీయ నాయకుడిలాగే ఉండిపోయాడు. జనాల్లో తిరగలేదు. కార్యకర్తల్లో స్ఫూర్తి రగిలించలేదు. కానీ జేపీ లాగే ప్రభుత్వ పదవి విడిచిపెట్టి రాజకీయాల వైపు అడుగులేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం జేపీకి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన జేపీలా కేవలం మాటలకు పరిమితం కావడం లేదు.

జనసేనలో చేరడానిక ిముందే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా తిరిగారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేశారు. కొన్ని గ్రామాల్ని దత్తత ీతీసుకుని స్వచ్ఛంద సంస్థల సాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. హుద్ హుద్ తుపాను సమయంలో చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరాక విశాఖ ఎంపీ టికెట్ ఖరారవ్వగానే తన నియోజకవర్గ పర్యటనలో సుడిగాలి పర్యటనలు చేశారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికల వరకు జనాల్లోనే ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే.. ఎన్నికలు ముగిశాక ఆయన మరింత యాక్టివ్ అయ్యారు. విశాఖలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇది జనాల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టగలరని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English