ఏబీ హర్ట్... సాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తారట

ఏబీ హర్ట్... సాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తారట

ఏపీలో జరిగిన ఎన్నికలు... రాజకీయ పార్టీల మధ్య వైరాలనే కాకుండా ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు కూడా వైరాలను ఆపాదించేశాయి. అధికార పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ... పలువురు ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ అధికారులపైనా విపక్షం వైసీపీ సంచలనాత్మక ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఏబీతో పాటు మరో ఇద్దరు జిల్లా ఎస్పీలను కూడా ఈసీ బదిలీ చేసింది.

ఈ వ్యవహారం ఈసీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాథాన్నే ఏర్పరచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల కోలాహలం నేపథ్యంలో ఈ వివాదం అప్పటికప్పుడు సద్దుమణిగినా... ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మరోమారు ఏబీపై విమర్శలు గుప్పించారు. ఈ-ప్రగతి సంస్థతో ఏబీ కుటుంబ సభ్యులకు సంధాలున్నాయని మరో సంచలన ఆరోపణ చేశారు. తన విధి నిర్వహణకు సంబంధించి ఓ రాజకీయ పార్టీగా వైసీపీ ఏ తరహా ఆరోపణలు చేసినా పెద్దగా పట్టించుకోని ఏబీ... తన కుటుంబానికి ఓ కాంట్రాక్టు సంస్థతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేయడంతో బాగానే హర్ట్ అయినట్టున్నారు.

ఈ క్రమంలో సాయిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఏబీ... తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా నిరాధార ఆరోపణలు గుప్పించిన సాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ- ప్రగతి ప్రాజెక్టుతో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టిన ఏబీ... తనపై నిరాధార ఆరోపణలు గుప్పించిన సాయిరెడ్డిని కోర్టుకు ఈడుస్తానని ప్రకటించారు. మొత్తంగా ఏబీని హర్ట్ చేసిన సాయిరెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నయన్న వాదన వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English