పవన్‌ కళ్యాణ్‌ జీరోనా... హీరోనా?

పవన్‌ కళ్యాణ్‌ జీరోనా... హీరోనా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై పవన్‌కళ్యాణ్‌, అతని పార్టీ జనసేన ఖచ్చితంగా ముద్ర వేయగలిగాయి. యువతని ప్రభావితం చేయడంలో పవన్‌ సక్సెస్‌ అయ్యాడు. అలాగే నిజాయతీపరుడు, సినిమాల్లో ఆదాయం వదులుకుని మరీ వచ్చాడు అనేది కూడా పవన్‌కి ఒక వర్గంలో ఆదరణ తెచ్చిపెట్టింది. కానీ పవన్‌ మద్దతుదారులు అతడిని గెలిపించేంత మంది వున్నారా? అసెంబ్లీకి జనసేన నుంచి కనీసం కొందరయినా వెళ్లగలుగుతారా? దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకి ఓట్ల శాతం పరంగా గౌరవప్రదంగానే వచ్చినా కానీ సీట్లు అంతగా రావనేది ఎక్కువ మంది వెలిబుచ్చుతోన్న అభిప్రాయం. జనసేన తరఫున ఇతరులని విడిచిపెట్టి స్వయానా పార్టీ అధినేత కూడా గెలవలేడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని విశ్వసనీయమైన సర్వేలలో కూడా పవన్‌ పార్టీకి జీరో సీట్లు వస్తాయనడం అభిమానుల్ని కలవరపెడుతోంది. ఒకవైపు పార్టీకి ఎంపీ సీట్లే ఒకటి నుంచి మూడు వరకు వస్తాయని అభిమానులు ఆశిస్తోంటే, అసెంబ్లీ సీట్లు కూడా అన్ని రావనే వారున్నారు. త్రిముఖ పోరులో ఆధిక్యాలు అత్యల్పంగా వుండే పరిస్థితుల్లో ఎవరికి ఎన్న సీట్లు వస్తాయనే అంచనాలని విశ్వసించాల్సిన పని లేదు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, కృష్ణ, గుంటూరు జిల్లాలలో జనసేన గణనీయమైన ప్రభావం చూపించిందని, ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంటుందని చెబుతోన్న రాజకీయ విశ్లేషకులు కూడా వున్నారు. పవన్‌ కనుక డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తే మాత్రం ఈ ఎన్నికలలో అతనో బాహుబలి అనవచ్చుననడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English