నిజామాబాద్ ఎన్నిక‌పై అనుమానాల చిట్టా ఇదే

నిజామాబాద్ ఎన్నిక‌పై అనుమానాల చిట్టా ఇదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార్తె క‌మ్ నిజామాబాద్ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న కవిత బ‌రిలోకి దిగిన సిట్టింగ్ స్థానం ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఎన్నిక‌పై దేశ వ్యాప్తంగా అంద‌రి క‌న్ను ప‌డింది. త‌మ డిమాండ్ల‌ను పట్టించుకోని ప్ర‌భుత్వాల తీరుపై క‌డుపు మండిన రైతులు పెద్ద ఎత్తున బ‌రిలో నిల‌వ‌టంతో ఇక్క‌డ ఏకంగా 185 మంది అభ్య‌ర్థులు పోటీకి దిగారు.

ఇదిలా ఉంటే.. పోలింగ్ శాతం పెరిగిన తీరుపై పలు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తొలుత పేర్కొన్న పోలింగ్ శాతానికి.. త‌ర్వాత వెలువ‌రించిన రివైజ్డ్ పోలింగ్ శాతానికి మ‌ధ్య వ్య‌త్యాసంపై బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ సోమ‌వారం తెలంగాణ రాష్ట్ర సీఈవో ర‌జ‌త్ కుమార్ ను క‌లిశారు.

ఈ ఎన్నిక‌ల పోలింగ్ పెరిగిన వైనంపై ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో ఏదైనా ఇబ్బంది త‌లెత్తితే ఆ మిష‌న్ ను మ‌ళ్లీ కౌంట్ చేయాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. కొన్ని ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి ఆల‌స్యంగా రావ‌టాన్ని ఆయ‌న ర‌జ‌త్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

స్ట్రాంగ్ రూమ్ లో నెల‌కొన్న ఇబ్బందుల దృష్ట్యా త‌మ సిబ్బందిని సెక్యురిటీగా పెట్టుకోవ‌టానికి అనుమ‌తి కోర‌గా.. కొంత ప‌రిధి వ‌ర‌కూ పెట్టుకోవ‌చ్చ‌ని.. కేంద్ర బ‌ల‌గాలు ఉంటాయి కాబట్టి పెద్ద‌గా ఇబ్బంది లేద‌ని చెప్పిన‌ట్లు సీఈవో చెప్పార‌న్నారు.  ఉప‌యోగం లేని ఈవీఎంల‌ను సీజ్ చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ నుంచి ఫోన్లు వ‌స్తున్నాయ‌ని.. పోలింగ్ ముగిసిన 48 గంట‌ల త‌ర్వాత ఉప‌యోగం లేని ఈవీఎంలు బ‌య‌ట ఎందుకు ఉన్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

మొత్తానికి నిజామాబాద్ ఎన్నిక‌ల పోలింగ్ మీద ఇప్ప‌టికే ప‌లు అనుమానాలు తెర మీద‌కు తెస్తూ కొన్ని ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు ప‌బ్లిష్ అయ్యాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ త‌ర‌హా క‌థ‌నాలేవీ ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌కు చెందిన ప‌త్రిక‌ల్లో ప‌బ్లిష్ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English