అప్పుడు సలహాలిచ్చిన వ్యక్తినే ఇప్పుడు దొంగంటారా?.. ఈసీపై టీడీపీ ఫైర్

అప్పుడు సలహాలిచ్చిన వ్యక్తినే ఇప్పుడు దొంగంటారా?.. ఈసీపై టీడీపీ ఫైర్

ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదం రోజురోజుకీ తీవ్రమవుతోంది. రెండు పక్షాలు లేఖాయుద్ధాలు చేస్తున్నాయి. తాజాగా చంద్రబాబునాయుడు దిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ పోగుచేసి ఈసీ తీరును ఎండగట్టారు. మరోవైపు టీడీపీ టెక్నికల్ కమిటీ సభ్యుడు హరిప్రసాద్‌పై ఈసీ చేసిన ఆరోపణలకూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదు.. వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఉంది.. అయితే, ఇప్పుడెలాగూ ఏమీ చేయలేం కాబట్టి కనీసం వీవీప్యాట్ రసీదుల్లోనైనా 50 శాతం లెక్కిస్తే ఫలితాలు కరెక్టుగా ఉంటాయి అంటూ చంద్రబాబు ఉద్యమం సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఆయన దీనిపై మాట్లాడారు. టీడీపీ నుంచి సాంకేతిక నిపుణులను పంపించాలని ఈసీ చెప్పగా శనివారం హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడిని ఈసీ వద్దకు టీడీపీ పంపింది. అయితే, ఆ హరిప్రసాద్ అనే వ్యక్తి 2010లో ఈవీఎం దొంగతనం కేసులో నిందితుడని, అలాంటి వ్యక్తిని ఎలా పంపిస్తారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపడుతూ లేఖ రాసింది. హరిప్రసాద్ మహారాష్ట్రలో ఈవీఎం దొంగతనం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించింది.

అయితే.. టీడీపీ ఇప్పుడు ఈసీ లేఖకు సమాధానం ఇచ్చింది. ఈసీ ఆరోపణలు చేస్తున్న హరిప్రసాద్ నుంచి గతంలో ఈసీయే పిలిపించుకుని మరీ సలహాలు తీసుకుందని అందులో గుర్తుచేసింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. దీంతోపాటు హరిప్రసాద్ మీద నమోదైన కేసుకు సంబంధించి తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఛార్జిషీట్ ఫైల్ కాలేదని రవీంద్రకుమార్ తెలిపారు.

‘భారతీయ ఈవీఎంల వ్యవస్థ బలహీనమైనందంటూ 2010లో అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందిన రచయితలతో కలసి హరిప్రసాద్ రీసెర్చ్ పేపర్లు సమర్పించారు. ఆ తర్వాత ఆయన్ను గతంలో సీఈసీలుగా పనిచేసిన డాక్టర్ ఎస్‌వై. ఖురేషీ, వీఎస్ సంపత్‌లు హరిప్రసాద్ నుంచి సూచనలను స్వీకరించాయి. ఆ తర్వాత వీవీప్యాట్‌లను డిజైన్ చేశారు. 2011లో వీవీప్యాట్‌ల మీద నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ హరిప్రసాద్‌ను కూడా ఆహ్వానించింది. అప్పటి సీఈసీ వీఎస్ సంపత్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అలోక్ శుక్లాను కూడా ఆయన కలిశారు. హరిప్రసాద్ ఇచ్చిన సూచనలను ఈసీ కూడా నోట్ చేసుకుంది. దీంతోపాటు చాలాసార్లు ఎన్నికల కమిషన్ హరిప్రసాద్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని సలహాలు తీసుకుంది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి అని ఎలా మాట్లాడతారు?’ అని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఈసీకి రాసిన లేఖలో ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English