విపక్షాల్ని ఒక వేదిక మీదకు తెచ్చిన బాబు

విపక్షాల్ని ఒక వేదిక మీదకు తెచ్చిన బాబు

ఏదైనా ఒక ఇష్యూను టేకప్ చేస్తే దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే వరకూ వదిలిపెట్టరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మాటకు తగ్గట్లే ప్రస్తుతం ఆయన తీరు ఉందని చెప్పాలి. ఏపీలో జరిగిన పోలింగ్ విషయంలో చిర్రెత్తుకొచ్చిన బాబు.. ఢిల్లీ బాట పట్టటమే కాదు.. ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని తన మిత్రులకు చెప్పటం ద్వారా.. మిగిలిన వారిని అలెర్ట్ చేస్తున్నట్లుగా చెప్పాలి.

వేలాది ఈవీఎంలు పని చేయకపోవటం.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకపక్షంగా ఉండటం.. కొన్ని అంశాల మీద చురుగ్గా వ్యవహరిస్తున్నట్లుగా ఉంటూ.. మరికొన్ని అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ప్రశ్నించటం.. సీఈసీ విశ్వసనీయత సందేహాస్పదంగా మారిందన్న కొత్త సందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఢిల్లీకి వెళ్లిన రోజు వ్యవధిలోనే చంద్రబాబు.. ఆదివారం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

దీనికి కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు కపిల్ సిబల్.. అభిషేక్ మను సింఘ్వీ.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఇతర పార్టీలకు చెందిన నేతలంతా కలిసి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టటం ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటం మీద సమావేశాన్ని నిర్వహించాయి.

తాజా సమావేశంలో విపక్షాలు ఒక డిమాండ్ ను మూకుమ్మడిగా తెర మీదకు తెచ్చాయి. ఈవీఎంలతో ఎన్నికలు జరిగిపోయినందున.. వాటిని కాదనే కన్నా.. వీవీ ఫ్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని నిర్ణయించాయి. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని పార్టీలు ప్రకటించాయి.

ఇదే అంశంపై ఈ మధ్యన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయటం.. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి యాభై శాతం వీవీ ఫ్యాట్ స్లిప్పులు లెక్కించటం కష్టమని.. ఫలితాల వెల్లడికి ఆరు రోజులు పడుతుందని చెప్పి కుదరదని తేల్చేసింది. దీంతో.. సుప్రీంకోర్టు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వరకూ వీవీ ఫ్యాట్లలో 50 వరకు స్లిప్పులు లెక్కించాలని పేర్కొంది.

ఎన్నికలు పారదర్శకంగా జరగటం లేదన్న విషయాన్ని చెబుతున్న బాబు.. అందుకు ఉదాహరణగా తెలంగాణలో 25 లక్షల ఓట్లు రద్దు చేశారని..దీనిపై ఎన్నికల సంఘం కేవలం సారీ చెప్పేసిందని చెప్పారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ప్రశ్నిస్తూ.. ఎన్నికల సంఘం చేసిన తప్పుల్ని తెర మీదకు తేవటం కొత్త పరిణామంగా మారింది. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు అండ్ కో చెబుతున్న మాటకు అత్యున్నత న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English