విజయసాయిపై కాలమ్ తో కసి తీర్చుకున్న ఆర్కే

విజయసాయిపై కాలమ్ తో కసి తీర్చుకున్న ఆర్కే

ఏపీ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయ విరోధం వ్యక్తిగతంగా మారటమే కాదు.. డూ ఆర్ డై అన్నట్లుగా భావించి రెండు రాజకీయ పక్షాలు పోటీ పడితే ఎలా ఉంటుందన్న విషయం ఏపీ ఎన్నికల్ని చూసిన ప్రతిఒక్కరికి అర్థమైంది. ఎన్నికల సందర్భంగా బాబుకు మద్దతుగా నిలిచినట్లుగా భావించిన ఏ ఒక్కరిని వదల్లేదు జగన్ బ్యాచ్.

మీడియా అధినేతగా.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేను విజయసాయి ట్వీట్స్ తో టార్గెట్ చేయటం తెలిసిందే. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు - ఆర్కేలకు సంబంధించిన రెండు వీడియో క్లిప్పులను బయటపెట్టిన జగన్ పరివారం.. వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

ఈ వీడియోలపై ఆర్కే ఇప్పటివరకూ రియాక్ట్ అయ్యింది లేదు. మొదటి వీడియోపై రిటార్ట్ వార్తను పబ్లిష్ చేసిన ఆంధ్రజ్యోతి.. రెండో వీడియోపై మాత్రం కామ్ గా ఉండిపోయింది. తనపై అదే పనిగా ట్వీట్స్ చేసిన విజయసాయికి ఆర్కే ఈ రోజు (ఆదివారం) తాను రాసిన కొత్త పలుకు కాలమ్ తో ఘాటు రిప్లై ఇచ్చారు.

తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విజయసాయి చేసిన ట్వీట్స్ కు బదులివ్వని ఆర్కే.. తాజాగా రాసిన తన కాలమ్ లో ఆయన్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. రెండు పేరాలు కేటాయించారు. ఎప్పటిలానే తన మొండితనాన్ని.. ధైర్యాన్ని.. తనను ఆడిపోసుకునే ప్రత్యర్థుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో.. తాజాగా అలాంటి రియాక్షనే వచ్చింది. ఈ సందర్భంగా విజయసాయి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న జోస్యాన్ని చెప్పటం విశేషం. ఆర్కే ఏం అన్నారు?  విజయసాయి ట్వీట్స్ కు ఆర్కే తన కాలమ్ తో ఎలాంటి పంచ్ ఇచ్చారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
 
"వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలి రోజుల్లో నన్ను విమర్శించడంతోపాటు అడ్డమైన ఆరోపణలు చేశారు. గతంలో నన్ను రెండు పర్యాయాలు కలిసిన విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు చూసి ఆయన సాత్వికుడు అని భావించాను. ప్రస్తుతం ఆయన ప్రవర్తన చూసిన తర్వాత ఆర్థిక నేరాలకు దర్శకత్వం వహించడంలోనే కాదు- క్రిమినాలజీ విషయంలో కూడా ఆయన దిట్ట అన్న భావన కలుగుతోంది. దందాలు, సెటిల్‌మెంట్లు, మేళ్లు చేయడం ద్వారా పర్సంటేజీలు అందుకున్నట్టు అభియోగాలున్న విజయసాయి రెడ్డి తన దారిలోనే అందరూ నడుస్తారని భావిస్తున్నట్టుగా ఉంది. అధికారంలోకి రాకముందే విజయసాయి రెడ్డి ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటే.. గ్రహచారం కొద్దీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు"

"గతంలో నన్ను జైలుకు పంపుతానన్న గాలి జనార్ధన్‌ రెడ్డి తానే జైలుకు వెళ్లాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా నన్ను జైలుకు పంపుతానని చెబుతున్నారంటే ఆయనకు మళ్లీ జైలుయోగం ఉన్నట్టుంది. తమ దారిలోకి రావడం లేదన్న కక్షతో మీడియాకు కులాన్ని ఆపాదించే దుస్సాహసాన్ని కూడా విజయసాయి రెడ్డి చేశారు. కుడి ఎడమల ఎటు చూసినా రెడ్డి సామాజికవర్గం వారే ఉండే జగన్‌ మీడియాకు నిధులు సమకూర్చిపెట్టిన విజయసాయి రెడ్డి... కులం గురించి మాట్లాడటమా? మురుగుకాల్వలో పొర్లాడే వరాహం తన ముందు తిరిగే మనుషులను చూసి ‘వాళ్లేమిటి అంత మురికిగా ఉన్నారు’ అని భావిస్తుందట! కులతత్వం విషయంలో విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఈ కోవలోకే వస్తాయి" అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English