మోదీపై ప్రియాంక గాంధీ పోటీ?

మోదీపై ప్రియాంక గాంధీ పోటీ?

ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్‌గా ఉన్నాయో దేశ రాజకీయాలూ అంతే వేడిగా ఉన్నాయి. మోదీని గద్దె దించి ఎలాగైనా ప్రధాని కావాలని ఆశపడుతున్న రాహుల్ గాంధీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈసారి దక్షిణాదిలోనూ సీట్లు పెంచుకోవాలనే లక్ష్యంతో.. ముఖ్యంగా కేరళలో కొంత ఊపు తేవాలన్న కోరికతో ఆయన ఈసారి అమేథీతో పాటు కేరళలోని వాయనాడు నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరో సెన్సేషనల్ ఆలోచనతో బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మోదీపై ఏకంగా తమ కుటుంబం నుంచే అభ్యర్థిని బరిలో దింపాలని అనుకుంటున్నారట రాహుల్. ఆ క్రమంలో తన సోదరి ప్రియాంకను వారణాసిలో మోదీపై పోటీకి నిలపాలని అనకుంటున్నట్లు సమాచారం.

ఈ మధ్యే ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకా దూకుడు పెంచారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ లోని కొన్ని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ ప్రాంతంలో పార్టీ పటిష్ఠత తదితర అంశాలపై దృష్టి సారించారు. రాయబరేలీలో తన తల్లి సోనియా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. తరువాత గుజరాత్ గాంధీనగర్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా వారణాసి నుంచి మాత్రమే మోదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ అధికారికంగా ప్రకటించింది కూడా.

ఇప్పుడు ప్రియాంక నిజంగానే అక్కడి నుంచి పోటీచేస్తే పెద్ద విషయమే అవుతుంది. దేశంలో ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా ప్రధానిపై నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీ చేసినట్లవుతుంది. దేశ రాజకీయాలు, ఎన్నికల చరిత్రలోనే ఇదే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English