శభాష్ విజయసాయి.. ఈసీని పొగిడేసిన విజయసాయి

శభాష్ విజయసాయి.. ఈసీని పొగిడేసిన విజయసాయి

ఏపీ ప్రజలే కానక్కర్లేదు.. మెడకాయ మీద తలకాయి ఉన్నోళ్లు ప్రతిఒక్కరు ఏపీలో నిర్వహించిన ఎన్నికల ఏర్పాట్ల మీద తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసినోళ్లే. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ పక్కరోజు తెల్లవారుజామున 5 గంటల వరకూ సాగేలా చేసి.. ఎవర్.. నెవ్వర్ చెత్త రికార్డును తన సొంతం చేసుకున్న వైనం తెలిసిందే.

వంద కాదు.. వెయ్యి కాదు.. వేలాది ఈవీఎంలు పని చేయక.. ఓటు వేసేందుకు వచ్చిన ఏపీ ప్రజలకు పగలే చుక్కలు చూసిన సంగతి. అలాంటి పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొదలుకొని.. సామాన్య కార్యకర్త వరకూ ఏ ఒక్కరూ పల్లెత్తు మాట అన్నది లేదు. అది సరిపోదన్నట్లు తాజాగా ఈసీకి లేఖ రాసిన విజయసాయి.. మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఎన్నికల్ని స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా నిర్వహించినందుకు తమ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపిన విజయసాయి సంచలనంగా మారారు. ఓపక్క ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది మాట్లాడుతూ.. రక్షణ ఏర్పాట్లు సరిగా చేయలేకపోయామని.. కేంద్రాన్ని తాము కోరినా తగినన్ని బలగాల్ని పంపలేదన్న మాట ప్రజల మనసుల్లో పచ్చి పచ్చిగా ఉన్న వేళ.. విజయసాయి మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఆ మాటకు వస్తే.. ఏపీలో ఒకవేళ జగన్ పార్టీ కానీ పవర్లోకి వస్తే.. ఈ తరహా వ్యాఖ్యలు మరెన్ని చూడాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్షలాది మంది ఓటర్లు ఎన్నికల సందర్భంగా తీవ్ర అవస్థలకు గురైతే.. తప్పు పట్టటం తర్వాత.. పొగిడేయటం చూస్తే.. రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు ఇలాంటి సిత్రాలు మరెన్ని చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రోళ్లకు ఇలాంటివి చాలానే అనుభవాలు ఎదురు కావటం ఖాయమంటున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదుగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English