ఓటర్లకే కాదు.. జగన్ కూ కనిపించిందట

ఓటర్లకే కాదు.. జగన్ కూ కనిపించిందట

ఏపీలో జరిగిన పోలింగ్ అనంతరం ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారింది. ఏపీలో పోలింగ్ ట్రెండ్ ఎలా సాగిందన్న విషయాన్ని జగన్ తనదైన శైలిలో చెప్పటంతో ఈ వ్యాఖ్య రోటీన్ కు భిన్నంగా సాగిందని చెప్పాలి.

ఒకవైపు పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించిన వైనాన్ని జగన్ మోహన్ రెడ్డి పెద్దగా ప్రస్తావించలేదు. అదే సమయంలో.. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు మాత్రం అదే పనిగా ప్రస్తావించటం.. ఎన్నికల నిర్వహణలోనూ.. ఈవీఎంల మొరాయింపుపైన అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేయటం కనిపించింది.

ఓపక్క పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించాయని.. ఓట్లు వేసేందుకు వేలాది మంది వెయిట్ చేస్తున్నారన్న వార్తలు చానళ్లలో వస్తున్న వేళలో మాట్లాడిన జగన్.. పోలింగ్ బాగా జరిగిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఉదయం నుంచి 80 శాతం మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారని.. 3.93 కోట్ల పైచిలుకులో 80శాతం మంది పోలింగ్ లో పాల్గొన్నారని.. వారంతా ఈవీఎంలలో బటన్ నొక్కితే ఏ అభ్యర్థికి ఓటు వేసింది.. వీవి ప్యాట్ లో వారికి కనిపించింది. అంటే.. ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్లు కనిపిస్తుంది. నాక్కూడా కనిపించింది. నాలాగే 80 శాతం మంది ఓటర్లకు ఓటేస్తే.. ఏ పార్టీకి ఓటేసింది వారికి కనిపించింది. పోలింగ్ పూర్తి అయ్యేసరికి దాదాపు 85 శాతం వరకు వెళ్లొచ్చంటూ వ్యాఖ్యానించారు.

ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేసి.. ఎవరికి ఓటేసిన విషయాన్ని వీవి ప్యాట్లలో స్పష్టంగా చూసుకున్నప్పుడు ఎవరైనా నెగిటివ్ గా ఎలా మాట్లాడతారు. కేవలం ఓడిపోతున్నారు కాబట్టే బురదజల్లటానికి ఏవో కారణాలు వెతుక్కొని మాట్లాడుతున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈవీఎంల మొరాయింపుతో వేలాది మంది ఓట్లు వేయటానికి క్యూలో నిలుచున్న వేళలో.. జగన్ ఇంత సంతృప్తికరంగా పోలింగ్ జరిగిన తీరుపై వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English