నాన్ స్టాప్ గా బాబు.. అందుకు భిన్నంగా జగన్.. పవన్

నాన్ స్టాప్ గా బాబు.. అందుకు భిన్నంగా జగన్.. పవన్

ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం పూర్తి అయి.. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోలింగ్ షురూ అయ్యింది. ఎన్నికల సందర్భంగా చాలా తక్కువమంది ఫోకస్ చేసిన అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 60ప్లస్ చంద్రబాబుకు.. 40 ప్లస్ జగన్.. పవన్ లకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది.

తన ప్రచారాన్ని షురూ చేసింది మొదలు చంద్రబాబు అదే పనిగా నాన్ స్టాప్ గా సభల మీద సభలు నిర్వహించగా.. అందుకు భిన్నంగా విపక్ష నేత జగన్.. జనసేన అధినేత పవన్ ల ప్రచారం సాగిందని చెప్పాలి.  రికార్డు స్థాయిలో చంద్రబాబు రోడ్ షోలు.. ప్రచార సభల్ని నిర్వహించగా.. జగన్ మాత్రం బ్రేకుల మీద బ్రేకులు వేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం విశేషం.

చంద్రబాబు ప్రచారం మొదలైన నాటి నుంచి ఎన్నికల ప్రచారానికి చివరిరోజు.. చివరి నిమిషం వరకూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియాల్సి ఉండగా.. సరిగ్గా 4.59 గంటలకు తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. అంటే.. ఒక్క నిమిషం ముందు మాత్రమే తన ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు.

అదే సమయంలో జగన్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరును చూస్తే.. ఆసక్తికరంగా కనిపిస్తుంది. మార్చి 5న ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన జగన్ అదే రోజు రాత్రి లోటస్ పాండ్ కు వెళ్లిపోయారు. తర్వాతి రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయి.. సాయంత్రం ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మళ్లీ రాత్రికి లోటస్ పాండ్ కు చేరుకున్నారు.

తర్వాత నాలుగు రోజులు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. పది వరకు ప్రచారం చేసిన ఆయన మళ్లీ రెండు రోజులు ప్రచారానికి విరామం ఇచ్చారు. తర్వాత ప్రచారాన్ని స్టార్ట్ చేసినా.. బాబాయ్ వివేకా హత్య నేపథ్యంలో ఒక రోజు ప్రచారాన్ని నిలిపివేశారు. నెల చివర్లో (మార్చి 27న) కూడా ఒక రోజు ప్రచారాన్ని ఆపారు. తన చివరి ప్రచార సభను తిరుపతిలో ముగించారు.

ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన ప్రచారం నాన్ స్టాప్ గానే సాగింది. చివర్లో ఆయనకు వడదెబ్బ తగలటంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచార ఘట్టం చివరికి వచ్చిన సందర్భంలో పవన్ ఆరోగ్యం దెబ్బ తినటం.. ఆయన రెస్ట్ తప్పదన్న మాటను వైద్యులు చెప్పినా.. ఒకట్రెండు ప్రచార సభల్లో పాల్గొన్నారు. బాబు.. జగన్.. పవన్ ల  ప్రచారాన్ని చూసినప్పుడు ఇంత ఏజ్ లోనే బాబు నాన్ స్టాప్ గా ప్రచారం చేస్తే.. జగన్.. పవన్ లు మాత్రం అందుకు భిన్నంగా ప్రచారానికి బ్రేకులు వేయటం కనిపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English