పొద్దున ప్రచారం.. రాత్రి అయితే లోటస్ పాండ్ కే ఎందుకు?

 పొద్దున ప్రచారం.. రాత్రి అయితే లోటస్ పాండ్ కే ఎందుకు?

నెలల తరబడి పాదయాత్ర కోసం ఇంటికి దూరంగా ఒక పార్టీ అధినేత.. తన చిరకాల కలను సాకారం చేసుకోవటానికి ఇంటిముఖం చూడరు. కానీ.. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. తాజాగా ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఎక్కడ ప్రచారం నిర్వహించినా.. ఆలస్యమైనా అర్థరాత్రికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకోవటం కనిపిస్తుంది.

సాధారణంగా ప్రధాన పార్టీల అధినేతలు ఎవరైనా.. తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించటానికి.. పర్యటల్ని వేగంగా నిర్వహించుకోవటానికి వీలుగా.. ఎక్కడైతే తమ ప్రచారాన్ని ఆపారో.. పక్కరోజు దగ్గర్లోని మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం ఎక్కడైనా జరుగుతుంది.

అందుకు భిన్నంగా జగన్ మాత్రం ఉదయం ప్రచారం మొదలు పెట్టటానికి హైదరాబాద్ నుంచి ఏపీకి రావటం.. రాత్రి అయ్యేసరికి  ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్లే వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.  ఎందుకిలా?  అన్నది ఇప్పుడు అందరి నోట ప్రశ్నగా మారింది. రెగ్యులర్ రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా జగన్ వ్యవహరించిన తీరు వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తన ఎత్తులు ఎదుటివారికి అర్థం కాకుండా ఉండటంతో పాటు.. తన భేటీలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకూడదన్న ఉద్దేశంతోనే జగన్ ప్రతి రోజూ రాత్రి లోటస్ పాండ్ కు వెళ్లేవారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సలహాలు.. సూచనలు ఇవ్వటం.. డైలీ బేసిస్ లో ఏపీలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన అంశాల్ని సమీక్షించుకోవటానికి వీలుగానే జగన్ హైదరాబాద్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే అంశాన్ని ఏపీలో ఉండి నిర్వహిస్తే.. ఆ విషయం బయటకు పొక్కటం ఖాయం. అదే జరిగితే రాజకీయంగా జరిగే నష్టం భారీగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే జగన్ నిత్యం లోటస్ పాండ్ కు వెళ్లేవారని చెబుతున్నారు. అక్కడో వార్ రూంను ఏర్పాటు చేశారని.. ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు పొక్కకుండా ఉండటానికి పొరుగు రాష్ట్ర సాయాన్ని తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. తనకు సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటకు రాకుండా ఉండే వీలు హైదరాబాద్ లోనే ఉంటుందన్న నమ్మకమే జగన్ ను నిత్యం.. ఎంత రాత్రి అయినా లోటస్ పాండ్ కు వచ్చేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English