పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఈసీని కలిసిన సీఎం

పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఈసీని కలిసిన సీఎం

ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికలకు ఒక రోజు ముందు ఒక సీఎం ఇలా కలవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఎందుకిలా?  అన్న ప్రశ్నకు సమాధానాలు చాలానే వినిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ.. వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. ఆరోపణలు వినిపిస్తున్నా.. చర్యలు తీసుకోవటంలో ఏపీలో చూపించినంత వేగంగా మరెక్కడా లేవన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని.. నిఘా డీజీతో పాటు పలువురు ఎస్పీలను.. ఇతర అధికారుల్ని ఎడాపెడా బదిలీలు చేస్తూ ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాలపైన ఏపీ అధికారపక్షం తీవ్ర ఆగ్రహాన్ని.. అసంతప్తిని వ్యక్తం చేస్తోంది.

రాజకీయ కోణంలో విపక్షం ఇస్తున్న ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తీరులో.. దేశంలో మరెక్కడా జరగటం లేదన్న వాదనను పలువురు టీడీపీ తమ్ముళ్లు వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు.. తమ పార్టీ నేతల్ని వెంట పెట్టుకొని మరీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ద్వివేదిని కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను ఆయన ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని.. వీవీ ఫ్యాట్ ల స్లిప్పులను లెక్కించాలని కోరినట్లు చెప్పారు.

డేటా చోరీ కేసులో ఐపీ అడ్రస్ లు ఇవ్వలేదన్న ఆయన.. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తప్పిస్తే.. సింఫుల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారని తప్పు పట్టారు. ఈసీ పరిధిలో లేకున్నా.. అధికారుల్ని బదిలీ చేశారని.. ఎలాంటి ఫిర్యాదు లేకున్నా కడప ఎస్పీని బదిలీ చేశారెందుకు? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్న అధికారులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎందుకు దాడులు చేయటం లేదని ప్రశ్నించారు. ఈసీ తీరుపై పలు ప్రశ్నలు సంధించిన బాబు మాటల్ని వింటే అంతో ఇంతో సందేహం రాక మానదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English