అన్ని మాటలు చెప్పే జగన్.. బాబాయ్ అలక తీర్చరే?

అన్ని మాటలు చెప్పే జగన్.. బాబాయ్ అలక తీర్చరే?

ప్రత్యర్థులకు సంబంధించిన చిన్న విషయాల్ని గోరంతలు కొండంతలు చేసి చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ లుకలుకల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కవర్ చేస్తారని చెప్పాలి. ఎదుటోడి చిన్న రంధ్రాన్ని సైతం 70ఎంఎంలో చూపించే అలవాటున్న జగన్.. తనకు అత్యంత సన్నిహితులు దూరంగా ఉంటున్న విషయాన్ని మీడియాలో ఫోకస్ కాకుండా జాగ్రత్త పడటం కనిపిస్తుంది.

జగన్ బాబాయ్ గా సుపరిచితుడు.. ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గడిచిన కొంతకాలంగా అలక చెట్టు ఎక్కటం తెలిసిందే. జగన్ తీరుపై గుర్రుగా ఉన్న ఆయన.. ప్రచారానికి దూరంగా ఉంటూ తనకు పట్టున్న ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టకపోవటం గమనార్హం. అంతేకాదు.. ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ.. అటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డితో లంకె కుదరక.. తనకు జగన్ చేసిన నష్టాన్ని కడుపులో ఉంచుకున్నారే తప్పించి.. పెదవి విప్పలేదు.

ఫిబ్రవరి నెలఖరు నుంచి ప్రకాశం జిల్లాకు దూరంగా ఉన్న ఆయన కారణంగా.. ఆయనకు ముఖ్య అనుచరులు.. కీలక కార్యకర్తలు పలువురు టీడీపీలో చేరిపోగా.. మరికొందరు తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ నాయకుడికి జగన్ చేసిన నష్టానికి బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

బాబాయ్ అలకను తీర్చని అబ్బాయ్ తీరుతో సుబ్బారెడ్డి బాధతో ఉన్నట్లు చెబుతున్నారు. అలా అని జగన్ కు దూరంగా ఉండని ఆయన.. తనకుఅప్పగించిన పని వరకూ చేసుకుంటూ పోతున్నారు. సుబ్బారెడ్డికి పట్టున్న ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టని ఆయన తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సుబ్బారెడ్డి గుర్రు పుణ్యమా అని.. ప్రకాశం జిల్లాలో జగన్ పార్టీ అభ్యర్థుల విజయం మీద ప్రభావం చూపుతుందన్న మాట వినిపిస్తోంది. దీనిపై సుబ్బారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసిన కొన్ని మీడియాసంస్థలకు ముక్తసరిగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు గోదావరి జిల్లాల్లో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారని.. ఆ పని చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రకాశంలో పట్టున్న సుబ్బారెడ్డిని గోదావరి జిల్లాలకు పంపి జగన్ ఏం సాధించాలని భావిస్తున్నట్లు..?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English