బాబు ఏపీని చుట్టేశారు... జగన్ కంటే వెనుకే పీకే

బాబు ఏపీని చుట్టేశారు... జగన్ కంటే వెనుకే పీకే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన పోలింగ్ కు తెర లేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్ కు సర్వం సిద్ధమైన వేళ... నేటి సాయంత్రంతో రాజకీయ పార్టీల ప్రచారానికి తెర పడింది. ఏ ఎన్నికల్లో అయినా ప్రచార పర్వమే కీలక ఘట్టం. పోలింగ్, కౌంటింగ్ లు అంతకంటే కీలకమైనవే అయినా... తాము అదికారంలోకి వస్తే... ఏం చేస్తామో చెబుతూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు పార్టీలన్నీ అలుపెరగకుండా కొనసాగించే ప్రచార పర్వమే ఏ ఎన్నికల్లో అయినా కీలకమేనని చెప్పాలి. ఇలాంటి కీలక పర్వం కాసేపటి క్రితం ముగిసిపోయింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్న అంశాన్ని ఎంత ప్రాధాన్యమైన అంశంగా భావిస్తామో, ఇప్పుడు ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత కూడా ఆ తరహా ఈక్వేషన్ ఒకటి అందరికీ ఆసక్తి రేకెత్తించేదే.

అదే ఏ పార్టీ అధినేత ఎన్ని బహిరంగ సభల్లో పాలుపంచుకున్నారు. ఎన్ని సభలు పెట్టారు. ఎన్ని రోడ్ షోలు నిర్వహించారు. మొత్తంగా రాష్ట్రంలోని ఎన్ని ప్రాంతాలను కవర్ చేశారన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్న తెలంగాణలో దీనిపై అంతగా ఆసక్తి లేకున్నా... లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఏపీలో మాత్రం ఈ అంశం ఆమితాసక్తిని రేకెత్తిస్తోంది. సరే... ఈ అంశం పూర్తి వివరాల్లోకి వెళితే... ఏపీలో అధికార పార్టీ టీడీపీ అధినేతగానే కాకుండా రాష్ట్రానికి సీఎంగా వ్యవహరిస్తున్న నారా చంద్రబాబునాయుడు తన వైరి వర్గాల కంటే కాస్తంత ముందుగానే ప్రచార పర్వాన్ని మొదలెట్టేశారు. గత నెల 16ననే ప్రచార పర్వాన్ని పట్టాలెక్కించిన చంద్రబాబు... నేటి సాయంత్రం దాకా (ఎన్నికల ప్రచారం ముగిసేలోగా) ఏకంగా 110 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. విపక్ష నేత, వైసీపీ అధినేత వైెస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై తనదైన శైలి విమర్శలు గుప్పిస్తూ సాగిన చంద్రబాబు... అలుపన్నదే ఎరుగని రీతిలో దూసుకుపోయారు. 70 ఏళ్ల వయసుకు దగ్గరపడ్డ చంద్రబాబు... నవ యువకులకు కూడా సాధ్యం కాని రీతిలో కాళ్లకు చక్రాలు కట్టుకున్న మాదిరిగా రాష్ట్రాన్ని చుట్టేశారు.

ఈ విషయంలో ఆయన అటు జగన్ తో పాటు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు అందనంత ఎత్తులో ఉన్నారని చెప్పక తప్పదు. ఇక చంద్రబాబు తర్వాతి ప్లేస్ మాత్రం జగన్ కొట్టేశారు. చంద్రబాబు కంటే ఓ రోజు ఆలస్యంగా గత నెల 17న ప్రచారాన్ని ప్రారంభించిన జగన్... నేటి సాయంత్రం దాకా 68 బహిరంగ సభల్లో మాట్లాడారు. పార్టీలోకి వెల్లువలా వచ్చి చేరుతున్న నేతల కారణంగా జగన్ కొంత మేర పార్టీ కార్యాలయంలో ఉండాల్సి రావడంతో కొన్ని సభలు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే... చంద్రబాబు, జగన్ ల కంటే చాలా ఆలస్యంగా గత నెల 21న ప్రచారం మొదలెట్టిన పవన్... నేటి సాయంత్రం దాకా 60 బహిరంగ సభలకు హాజరయ్యారు. యువకులైన జగన్, పవన్ ల కంటే వయసులో పెద్ద వారైనప్పటికీ... ఏమాత్రం అలసట లేకుండా చంద్రబాబు నిర్వహించిన ప్రచారమే ఈ ఎన్నికల్లో హైలెట్ గా నిలుస్తుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English