పవన్‌ కళ్యాణ్‌.. సినిమాల్లో మాదిరే ఇక్కడ కూడా

పవన్‌ కళ్యాణ్‌.. సినిమాల్లో మాదిరే ఇక్కడ కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. నాలుగేళ్ల పాటు పార్టీ నిర్మాణం మీదే దృష్టి పెట్టలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించే ప్రయత్నమే జరగలేదు. చివరికి ఎన్నికలు సమీపిస్తుండగా కొన్ని నెలల ముందు పవన్ రంగంలోకి దిగాడు. తన వరకు తాను బాగానే కష్టపడ్డాడు. కానీ కొత్త పార్టీ అన్నాక కొన్ని నెలల ముందే అభ్యర్థుల్ని ఖరారు చేసి వాళ్లు నియోజకవర్గాల్లోకి వెళ్లి పనులు చేసేలా, జనాల్లో తిరిగేలా చూడాల్సింది.

కానీ ఎస్టాబ్లిష్డ్ పార్టీల్లాగే పవన్ సైతం ఎన్నికలకు నెల కూడా లేని సమయంలో అభ్యర్థుల్ని ప్రకటించాడు. చాలా వరకు అభ్యర్థులు కొత్త వాళ్లు. వాళ్లు వెళ్లి ఇంత తక్కువ సమయంలో నియోజకవర్గం మొత్తం తిరగడం.. జనాల్ని ఆకర్షించడం.. వాళ్లను జనసేన వైపు మళ్లేలా కన్విన్స్ చేయడం సాధ్యమా? ఇంటింటికి వెళ్లి ఓటు వేయండి అంటే పార్టీని చూసి వేసేస్తారా?

కొన్ని నెలల ముందు అభ్యర్థి ఖరారై ఉండి.. అతను నియోజకవర్గంలో తిరిగి, పనులు చేస్తే కచ్చితంగా అతను మళ్లడానికి అవకాశముంటుంది. వేరే వాళ్ల దాకా ఎందుకు తన సోదరుడైన నాగబాబును కూడా చివరి దశలోనే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశాడు పవన్. ఆయన ఆదరాబాదరా నరసాపురం వెళ్లి ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన కొన్ని నెలల ముందే అక్కడికి వెళ్లి ఉంటే పరిస్థితి చాలా సానుకూలంగా ఉండేదేమో.

ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు చివరి దశలో వచ్చి జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వీళ్లంతా ముందే పార్టీకి మద్దతు ప్రకటించి.. ఇంకాస్త ముందే ప్రచారానికి వస్తే కచ్చితంగా కార్యకర్తల్లో, జనాల్లో జోష్ వచ్చేది. జనసేనకు ఉపయోగపడేది. పవన్ సినిమాల్లో ఉన్నపుడు కూడా ఇలాగే ఉండేవాడు. ఏళ్లకు ఏళ్లు ఖాళీగా గడిపేసేవాడు. సినిమా మొదలయ్యాక కూడా తాత్సారం చేసేవాడు. కానీ రిలీజ్ డేట్ ఖరారయ్యాక సినిమా పూర్తి చేయడానికి హడావుడి పడేవాడు. ఇలా హడావుడి పడే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలు డిజాస్టర్లయ్యాయి. మరి జనసేన విషయంలో హడావుడి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English