కేసీఆర్ మాటలు.. ఆంధ్రోళ్లకు అగ్నిపరీక్షేనా?

 కేసీఆర్ మాటలు.. ఆంధ్రోళ్లకు అగ్నిపరీక్షేనా?

ఆంధ్రోళ్లు మంచోళ్లు.. చంద్రబాబు లాంటి పది మంది కిరికిరిగాళ్లు తప్పించి మిగిలిన వోళ్లు మంచోళ్లు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలు కొందరు ఆంధ్రోళ్లకు ఆనందంతో ఉబ్బితబ్బుబ్బిపోయేలా చేసింది. కానీ.. ఆయన మాటలు ఆంధ్రోళ్లకు అగ్నిపరీక్షగా చెప్పక తప్పదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ల అహంకారమంటూ అవమానకరంగా మాట్లాడిన కేసీఆర్.. ఆంధ్రా  ప్రాంత నేతల పేరుతో ఆంధ్రోళ్ల మీద విరుచుకుపడటం.. విషం చిమ్మటం కొత్తేం కాదు.

ఒకవేళ ఆంధ్రోళ్లు అంత మంచోళ్లు అయినప్పుడు.. సమకాలీన రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనోళ్లు.. దాదాపు రెండు.. మూడు వందల ఏళ్ల క్రితం నాటి తెలుగు ప్రముఖుల విగ్రహాల్ని ధ్వంసం చేసినప్పుడు కానీ.. ఇప్పుడు కానీ వేదన చెందకపోవటాన్ని మర్చిపోకూడదు. ఒక చంద్రబాబు.. ఒక వైఎస్.. ఒక కిరణ్ కుమార్.. ఇలా కొందరు ఆంధ్రా దుర్మార్గులు తప్పులు చేస్తే.. వారితో ఏ మాత్రం సంబంధం లేని తెలుగు ప్రముఖుల విగ్రహాల్ని అడ్డదిడ్డంగా పగలగొట్టేసి.. గుండెల్లో చేసిన గాయాన్ని కేసీఆర్ నోటి నుంచి వచ్చే మంచోళ్లు అన్న సర్టిఫికేట్ సరిపోతుందా?

విద్వేషాన్ని చిందించి.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయటం.. అలా చేయటానికి ఆంధ్రా మీద ఆగ్రహాన్ని.. ఆంధ్రోళ్లు అహంకారులు.. వారి మాటలు.. చేతలు.. దుర్మార్గంగా ఉంటాయంటూ సాగించిన ప్రచారం ఈ రోజు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మంచోళ్లు అన్న మాటతో మరిచిపోవటం సాధ్యమేనా? అన్నది మరో ప్రశ్న.

నిజానికి కేసీఆర్ తాజాగా చేసిన ఆంధ్రోళ్లు మంచోళ్లు అన్న మాట ఏపీ ప్రజలకు అగ్నిపరీక్ష అనే చెప్పాలి.  తనకు అవసరమైన దానికి అందిపుచ్చుకోవటానికి సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం కేసీఆర్ కు కొత్తేం కాదు. అలాంటి కేసీఆర్.. ఈ రోజున ఆంధ్రోళ్లు మంచోళ్లు అని మురిసిపోతే.. అందుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. తాను పొగిడినప్పుడు పొంగిపోవటం.. తాను తిట్టినప్పుడు కుంగిపోవటం ఆంధ్రోళ్లకు అలవాటన్న నమ్మకం కేసీఆర్ కు కలగటం ఎంతవరకు మంచిదన్న విషయాన్ని ఏపీ ప్రజలు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ ప్రజల మాదిరే ఏపీ ప్రజల్ని సైతం తన మాటలతో ప్రభావితం చేయగలనని భావించే కేసీఆర్ లాంటి అధినేతలకు సరైన సమాధానం చెప్పే సత్తా ఆంధ్రోళ్లకు ఉందన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు.. ఓటుకు మించిన ఆయుధం మరొకటి ఉండదు. ఏపీ ప్రజల మెదళ్లలో కాస్త గుజ్జు ఉందన్న విషయం కసీఆర్ కు అర్థమయ్యేలా చేస్తారో.. లేదంటే తాను ఆడించే రీతిలో ఆడే బొమ్మలు ఆంధ్రోళ్లు అనేలా బదులిస్తారో చెప్పే అవకాశం ఇప్పటికి ఏపీ ప్రజల్లోనే ఉంది. ఆలోచించి.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నది మర్చిపోకూడదు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English